నేటి నుంచి నామినేషన్ల పర్వం

by velandi.Saikiran |

సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్లో భాగంగా మొదట విడుతగా ఎన్నికలు జరగనున్న గ్రామపంచాయతీలకు గురువారం నుంచి నామినేషన్ల

నేటి నుంచి నామినేషన్ల పర్వం
X

24 మండలాల్లో మొదటి విడత ఎన్నికలు

ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వీకరణ

ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేత

పెరగనున్న పోటీదారుల సంఖ్య

ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్లో భాగంగా మొదట విడుతగా ఎన్నికలు జరగనున్న గ్రామపంచాయతీలకు గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఆయా జిల్లాల స్థాయిలలో ఇప్పటికే ప్రత్యేక శిక్షణలు జరిగాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొదటి విడత ఎన్నికలు మొత్తం 24 మండలాల్లో జరగనున్నాయి. నారాయణపేట జిల్లాలోని కోస్గి, మద్దూరు, గుండుమల్, కొత్తపల్లి మండలాలు, మహబూబ్ నగర్ జిల్లాలోని గండీడు, మహమ్మదాబాద్, నవాబుపేట, రాజాపూర్, మహబూబ్ నగర్ మండలాల పరిధిలోని గ్రామపంచాయతీలకు మొదటి విడతలో ఎన్నికలు జరగనున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో గద్వాల, గట్టు, ధరూరు, కేటీదొడ్డి మండలాలు, వనపర్తి జిల్లాలో ఖిల్లాగణపురం, పెట్టమందడి, గోపాల్‌పేట, రేవల్లి, ఏదుల మండలాలు, నాగర్ కర్నూలు జిల్లాలో కల్వకుర్తి, ఊరుకొండ, వెల్దండ, వంగూరు, తాడూరు, తెలకపల్లి మండలాల్లో మొదటి విడుత ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ జరగనుంది.

ఉదయం 10నుంచి సాయంత్రం 5గంటల వరకు నామినేషన్ల స్వీకరణ...

మొదటి విడత ఎన్నికలకు సంబంధించి ఈ నెల 27నుంచి 29వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 30న నామినేషన్లు పరిశీలించి, డిసెంబర్ 2న వచ్చే ఫిర్యాదులను పరిశీలిస్తారు. డిసెంబర్ 3న ఉపసంహరణ ప్రక్రియ పూర్తవుతుంది. అదేరోజు సాయంత్రం పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితా మరియు గుర్తులను ప్రకటిస్తారు.

ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేత..

స్థానిక సంస్థల ఎన్నికలలో ముగ్గురు పిల్లల నిబంధనను ప్రభుత్వం ఎత్తివేసింది. ఎన్నికల నియమావళిని అనుసరించి ఎటువంటి లాభావేక్ష లేని ప్రభుత్వ, ఇతర నామినేటెడ్ పోస్టులలో లేని, ఇరవై ఒక్క సంవత్సరాలు దాటి ఉండి అదే గ్రామానికి చెందిన వ్యక్తులు నామినేషన్ వేయడానికి అర్హులు. జనరల్ స్థానంలో పోటీ చేసే జనరల్ అభ్యర్థులు రూ.2వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.1,000 నామినేషన్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేయడంతో పోటీదారుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Next Story