గుడ్ న్యూస్‌..త్వరలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ!

by velandi.Saikiran |   (  Updated:2026-03-05 22:00:35  IST  )

కాంగ్రెస్ పార్టీ నామినేటెడ్ పదవుల భర్తీకి కసరత్తు చేస్తుండడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయం వేడెక్కింది.

గుడ్ న్యూస్‌..త్వరలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ!
X

నామినేటెడ్ పదవులపై నేతల ఆశలు..

ఉమ్మడి పాలమూరులో మొదలైన పైరవీలు!

త్వరలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ అటూ ప్రచారం

ఉమ్మడి జిల్లా నేతల్లో చిగురిస్తున్న ఆశలు

ఇప్పటికే రాష్ట్రస్థాయిలో కొందరికి పదవులు..

మరికొందరికి స్థానిక సంస్థల్లో విజయం

ఎన్నికల్లో అవకాశం దక్కని నేతలకు హామీలు

ఎమ్మెల్యేలు, మంత్రుల చుట్టూ ఆశావహుల ప్రదక్షిణలు

రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ నామినేటెడ్ పదవుల భర్తీకి కసరత్తు చేస్తుండడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయం వేడెక్కింది. దాదాపు పది సంవత్సరాలపాటు అధికారానికి దూరంగా ఉన్న జిల్లా నాయకులు, కార్యకర్తలు ఈసారి ఎలాగైనా పదవులు దక్కించుకోవాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కొంతమందికి రాష్ట్రస్థాయి పదవులు దక్కగా, మరికొందరు ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే ఎన్నికల్లో పోటీకి అవకాశం దక్కని వారికి నామినేటెడ్ పోస్టులు ఇప్పిస్తామన్న హామీలతో ఆశావహుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీని నమ్ముకుని పనిచేసిన సీనియర్ నేతలు ఇప్పుడు రంగంలోకి దిగారు. ఎమ్మెల్యేల సిఫార్సు, మంత్రుల ఆమోదం తప్పనిసరి కావడంతో జిల్లా నేతలు పైరవీలు ముమ్మరం చేశారు. పార్టీ కోసం మొదటినుంచి పనిచేస్తున్న వారిని గుర్తిస్తారా? లేక సిఫార్సులకే పెద్దపీట వేస్తారా? అన్నది ఆందోళనకు గురిచేస్తోంది. పార్టీ పరంగా జిల్లా అధ్యక్షుడు మినహాయిస్తే మిగతా కమిటీలు, మండల స్థాయి బాధ్యతలను భర్తీ చేయాల్సి ఉంది. ఈ కమిటీలలో తమకు చోటు దక్కుతుందని చాలామంది ఆశిస్తున్నారు.

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుందనే ప్రచారం అధికార కాంగ్రెస్ పార్టీలో జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఆశావహుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, దాదాపు పదేళ్లపాటు అధికారానికి దూరంగా ఉన్న జిల్లా నాయకులు, కార్యకర్తలు ఈసారి ఎలాగైనా పదవులు దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే రాష్ట్రస్థాయిలో కొంతమందికి పదవులు దక్కగా, మరికొందరు ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించి పదవులను కైవసం చేసుకున్నారు. అయితే, ఇంకా అనేక కీలక పదవులు భర్తీ కాకుండా ఉండడంతో, అధిష్టానం వీటిని త్వరలోనే భర్తీ చేస్తామని ప్రకటించడం ఆశావహుల్లో ఉత్కంఠను పెంచుతోంది.

నామినేటెడ్ పోస్టులపై భారీ ఆశలు...

గతంలో జరిగిన సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల సమయంలో పోటీకి అవకాశం లభించని వారికి, నామినేటెడ్ పోస్టుల ద్వారా న్యాయం చేస్తామని పార్టీ అగ్రనేతలు హామీ ఇచ్చారు. అప్పటి నుంచి పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న సీనియర్ నాయకులతోపాటు, స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు దక్కని వారు కూడా ఇప్పుడు ఈ పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీని, అధిష్టానాన్ని నమ్ముకుని పనిచేసిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరిలో కొంతమంది రాష్ట్రస్థాయి పదవులను ఆశిస్తుండగా, మరికొందరు జిల్లాస్థాయి పదవులపై కన్నేశారు.

ఎమ్మెల్యేల ఆశీస్సులు-సిఫార్సులు..

నామినేటెడ్ పదవుల భర్తీలో స్థానిక ఎమ్మెల్యేల సిఫార్సులు, మంత్రుల ఆమోదం కీలక పాత్ర పోషించనున్నాయి. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలతో సఖ్యతగా ఉన్న వారికి లేదా మంత్రుల ఆశీస్సులు ఉన్న వారికి పదవులు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే, ఇది ఆశావహుల్లో కొంత ఆందోళనను కూడా కలిగిస్తోంది. పార్టీ కోసం మొదటి నుంచి నిజాయితీగా శ్రమించిన వారిని అధిష్టానం గుర్తిస్తుందా? లేక కేవలం ఎమ్మెల్యేల సిఫార్సులకే పెద్దపీట వేస్తుందా? అన్న అంశంపై చర్చ సాగుతోంది. నిబద్ధతతో పనిచేసిన కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి.

అసంపూర్తిగా పార్టీ కమిటీలు..

ప్రభుత్వ నామినేటెడ్ పదవులకే కాకుండా, పార్టీ అంతర్గత కమిటీల భర్తీపై కూడా దృష్టి సారించాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పదవిని మినహాయిస్తే, మిగిలిన జిల్లా కమిటీలు, అనుబంధ సంస్థలు, మండల కమిటీల భర్తీ ఇంకా పూర్తి కాలేదు. జిల్లా కమిటీల కోసం ఇప్పటికే అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించినప్పటికీ, కమిటీల ప్రకటనలో జాప్యం జరుగుతోంది. ఈ కమిటీలలో కూడా తమకు సరైన గుర్తింపు లభిస్తుందని చాలామంది ఆశావహులు భావిస్తున్నారు. భవిష్యత్తులో జరిగే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, పార్టీని బలోపేతం చేసే దిశగా ఈ పదవుల భర్తీ ఉంటుందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Next Story