కులాంతర వివాహం ప్రాణభయంతో కొత్త జంట

by Nallavelli.Anjaneyulu |

దిశ, గద్వాల క్రైమ్ : ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక జంటకు సొంత కుటుంబ సభ్యుల నుండే ప్రాణహాని ఎదురవుతున్న ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో వెలుగులోకి వ‌చ్చింది.

కులాంతర వివాహం ప్రాణభయంతో కొత్త జంట
X

దిశ, గద్వాల క్రైమ్ : ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక జంటకు సొంత కుటుంబ సభ్యుల నుండే ప్రాణహాని ఎదురవుతున్న ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో వెలుగులోకి వ‌చ్చింది. కులాలు వేరైనా, మేజర్లమంటూ ఇష్టపూర్వకంగా వివాహం చేసుకున్న తమను చంపేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారని, తమకు రక్షణ కల్పించాలని చంద్రకళ, మునిస్వామి అనే నవజంట పోలీసులను ఆశ్రయించింది. ఎర్రవల్లి మండలం బీచుపల్లి క్షేత్రంలో డిసెంబర్ 29, 2025న చంద్రకళ, మునిస్వామి ప్రేమ వివాహం చేసుకున్నారు. కులాంతర వివాహం కావడంతో తమ కుటుంబాల నుండి ముప్పు ఉంటుందని భావించిన వారు, రక్షణ కోరుతూ గద్వాల పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. అయితే, అక్కడ తమకు న్యాయం జరగకపోగా, పోలీసులు తమను గంటల తరబడి (మధ్యాహ్నం 2 నుండి రాత్రి 10:30 వరకు) స్టేషన్‌లో ఉంచి మానసిక వేదనకు గురిచేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బంధువుల బెదిరింపులు

వధువు చంద్రకళ తన ఫిర్యాదులో పేర్కొంటూ మా ఇష్టప్రకారమే మేము పెళ్లి చేసుకున్నాం. కానీ మా నాన్న శ్రీను, బాబాయ్ మహేంద్ర, మరికొందరు కుటుంబసభ్యులు కలిసి నానా భూతులు తిడుతూ మమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తున్నారు. స్టేషన్ బయట మనుషులను పెట్టి నిఘా వేశారు. మేము విడిపోయే ప్రసక్తే లేదు, ఒకవేళ మమ్మల్ని బలవంతంగా విడదీయాలని చూస్తే ఆత్మహత్యే శరణ్యం" అని యువతి చంద్రకళ తన లేఖలో పేర్కొంది. తమకు ప్రాణహాని ఉందని, పెద్దల నుండి తమను కాపాడి రక్షణ కల్పించాలని వారు గద్వాల సి.ఐ కి విజ్ఞప్తి చేశారు. కులాంతర వివాహాల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తమకు రక్షణ ఇవ్వాలని వారు కోరుతున్నారు.

Next Story