మున్సిపల్ ఎన్నికలను విజయవంతం చేయాలి : కలెక్టర్ బీఎం సంతోష్

by Nallavelli.Anjaneyulu |

గ్రామపంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించినట్లే మున్సిపల్ ఎన్నికలను కూడా విజయవంతం చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు.

మున్సిపల్ ఎన్నికలను విజయవంతం చేయాలి : కలెక్టర్ బీఎం సంతోష్
X

దిశ, గద్వాల కలెక్టరేట్ : గ్రామపంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించినట్లే మున్సిపల్ ఎన్నికలను కూడా విజయవంతం చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఎన్నికలతో పోలిస్తే మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఓటర్లకు ఎన్నికలపై అవగాహన ఎక్కువగా ఉంటుంది కాబట్టి తప్పిదాలు చోటు చేసుకోకుండా పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ కొనసాగేలా ఆయా జిల్లాల ఎన్నికల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. గద్వాల ఐడీఓసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌ నుంచి ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి వీసీలో పాల్గొన్న కలెక్టర్ బీఎం సంతోష్ వీసీ అనంతరం జిల్లా ఎన్నికల అధికారులతో మాట్లాడారు. జిల్లాలోని నాలుగు పురపాలికల్లో నామినేషన్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఆదేశించారు.

ఎన్నికల నిర్వహణలో ఏమైనా సమస్యలు ఉత్పన్నమైతే ఎప్పటికప్పుడు తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎన్నికల నిర్వహణపై అన్ని మున్సిపాలిటీల అధికారులతో తరచూ టెలీ, వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీల పరంగా పోటీ చేసే అభ్యర్థులకు ఆయా పార్టీల గుర్తులు కేటాయించడం జరుగుతుందని, మిగతా ప్రక్రియ మొత్తం గ్రామపంచాయతీ ఎన్నికల మాదిరే ఉంటుందన్నారు. ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికీ మాస్టర్ శిక్షకులు అవసరమైన సహాయ సహకారాలు అందించనున్నట్లు కలెక్టర్ చెప్పారు. ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ... ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మున్సిపల్ ఎన్నికలను విజయవంతం చేసేందుకు అవసరమైన పోలీస్ బందోబస్తు నియమించనున్నట్లు తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద శాంతి భద్రతల విషయంలో ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తామని ఎస్పీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, జెడ్పి డిప్యూటీ సీఈవో నాగేంద్రం, గద్వాల మున్సిపల్ కమిషనర్ జానకి రామ్ సాగర్ పాల్గొన్నారు.

Next Story