- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ప్రతి ఊరికో నర్స్ ఉండాలే’: మంత్రి దామోదర్ రాజనర్సింహ
చదువుతోనే సమాజంలో మార్పు..

దిశ, కందనూల్: చదువుతోనే సమాజంలో మార్పు.. ప్రతి ఊరికో నర్స్ విద్యనభ్యసించిన వారుండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ, కుటుంబ సంక్షేమ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆకాంక్షించారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని మున్సిపాలిటీల్లో సోమవారం మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటించి, నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చదువే సమాజంలో మార్పుకు నాంది పలుకుతుందని, విద్య ద్వారా ప్రజల్లో అవగాహన పెరిగి సామాజిక–ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
పాఠశాలల మౌలిక వసతుల అభివృద్ధి..
విద్య, వైద్య రంగాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, పాఠశాలల మౌలిక వసతుల అభివృద్ధి, ఉపాధ్యాయుల నియామకం, ఆధునిక సాంకేతికత వినియోగం ద్వారా విద్యా ప్రమాణాలు పెంపొందిస్తున్నారని చెప్పారు. చదువుతోనే సమాజంలో సానుకూల మార్పు సాధ్యమవుతుందని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ, కుటుంబ సంక్షేమ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు. విద్యార్థులు, బాగా చదువుకోవాలని, వైద్య రంగంలో సేవలందించాలన్నారు. నర్సింగ్ సిబ్బందికి జపాన్ లాంటి దేశంలో మంచి ఆదరణ ఉన్నదన్నారు. ప్రతి పేదవాడి ఆరోగ్యాన్ని కాపాడటమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు, ఆధునిక పరికరాలు, వైద్య సిబ్బంది నియామకంతో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 109 ట్రామా కేంద్రాలు, వృద్ధుల కోసం 37 ప్రణామ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, రూ.200 కోట్లతో 105 ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నామని వెల్లడించారు. చేపట్టిన అభివృద్ధి పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
శంకు స్థాపన, ప్రారంభోత్సవాలు..
ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని కేసరి సముద్రం చెరువు కట్టకు ఎండబెట్ల వద్ద రూ.10 కోట్ల నిధులతో మంజూరైన హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి, రూ.2 కోట్లతో సీసీ రోడ్లు, ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవనాలకు రూ.9 కోట్లతో శంకుస్థాపన, నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలో రూ.10 కోట్లతో సీసీ రోడ్లు, రూ.10 కోట్లతో డ్రైనేజీ వ్యవస్థ, రూ.3 కోట్ల 14 లక్షల 60 వేలతో కేసరి సముద్రం మినీ ట్యాంక్ బండ్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపనలు చేశారు. రూ.1 కోటి 5 లక్షల 50 వేల నిధులతో పట్టణంలో నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అదనపు తరగతి గదులకు ప్రారంభోత్సవం చేశారు. ఎంపీ డాక్టర్ మల్లు రవి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కొనసాగుతున్న ప్రభుత్వం ప్రజలే నడిపిస్తున్న ప్రభుత్వమని తెలిపారు. జిల్లాలో 27 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశారని, అందుకు ప్రభుత్వం రూ.93 కోట్లు చెల్లించిందని చెప్పారు. 500 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు భరోసా, రైతు బీమా, రుణమాఫీ వంటి పథకాలు అమలవుతున్నాయని వివరించారు. ప్రతి నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరి తల్లిదండ్రులకు గర్వకారణం కావాలి..
ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి మాట్లాడుతూ.. నాగర్ కర్నూల్ జిల్లాను విద్యా హబ్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. గత రెండు సంవత్సరాల్లో సుమారు రూ.1000 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, త్వరలో ఇంజినీరింగ్ కళాశాల తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాన్ని పది నెలల్లో పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని తెలిపారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరి తల్లిదండ్రులకు గర్వకారణం కావాలని ఆకాంక్షించారు. నాగర్ కర్నూల్ అభివృద్ధికి ముఖ్యమంత్రి సారథ్యంలో నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
విద్యార్థులతో మంత్రి ముఖాముఖి..
అంతకుముందు పలువురు విద్యార్థులతో మంత్రి దామోదర్ రాజనర్సింహ ముఖాముఖిగా మాట్లాడారు. జీవిత లక్ష్యాలు, ఆశయాలపై ప్రశ్నిస్తూ వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఐఏఎస్, డాక్టర్లు, ఇంజనీర్లు, ఆర్మీ, నేవీ వంటి రంగాల్లో రాణించాలనే లక్ష్యాలతో విద్యార్థులు ముందుకు సాగుతున్నారని తెలిపారు. క్రమశిక్షణ, నిరంతర శ్రమతో విజయం సాధ్యమని మంత్రి వారికి మార్గనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ పట్టణంలోని 245 మహిళా సంఘాల సభ్యులకు మంజూరైన రూ.7 కోట్ల 80 లక్షల 324 వడ్డీ లేని రుణాల చెక్కులను మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కలెక్టర్ అందజేశారు.






