చౌటపల్లి పాఠశాలను సందర్శించిన మండల విద్యాధికారి..

by Kodari Anjali |

చౌటపల్లి లోని ప్రాథమికోన్నత పాఠశాలను విద్యాధికారి జి. శ్రీనివాసమూర్తి, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కే. గోపాల్‌తో కలిసి సందర్శించారు.

చౌటపల్లి పాఠశాలను సందర్శించిన మండల విద్యాధికారి..
X

దిశ, అచ్చంపేట రూరల్: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని చౌటపల్లి లోని ప్రాథమికోన్నత పాఠశాలను మంగళవారం మండల విద్యాధికారి జి. శ్రీనివాసమూర్తి, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కే. గోపాల్‌తో కలిసి సందర్శించారు. ఇటీవల పది రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు పాఠశాల భవనంలోని ఒక గది గోడ కూలిపోవడంతో అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు మాట్లాడుతూ, కూలిన గదిని గతంలోనే తరగతుల నిర్వహణకు ఉపయోగించడం నిలిపివేశామని, కేవలం మధ్యాహ్న భోజన వంట కార్యక్రమాల కోసం మాత్రమే వినియోగిస్తున్నామని తెలియజేశారు.

విద్యార్థుల భద్రత విషయంలో...

విద్యార్థుల భద్రతే ప్రధానమని పేర్కొన్న మండల విద్యాధికారి, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని శిథిలావస్థలో ఉన్న తరగతి గదులను ఎట్టి పరిస్థితుల్లోనూ తరగతుల నిర్వహణకు ఉపయోగించరాదని, విద్యార్థులను ఆ గదుల్లో కూర్చోబెట్టరాదని ఉపాధ్యాయులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా, గోడ కూలిన గదికి వెంటనే తాళం వేసి, విద్యార్థులు ఎవరూ ఆ ప్రాంతానికి వెళ్లకుండా కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పాఠశాల భవన స్థితిగతులు, భద్రతా చర్యలు, అవసరమైన మరమ్మతులపై సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించినట్లు తెలిపారు. విద్యార్థుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా అధికారులు తక్షణ చర్యలు చేపడుతున్నారని ఈ సందర్భంగా వెల్లడించారు.

Next Story