మక్తల్‌కు మహర్దశ

by Pulgam srinivas |

మక్తల్ నియోజకవర్గ అభివృద్ధికి కీలక మలుపు తిప్పే రెండు అంతర్రాష్ట్ర రోడ్‌కమ్ బ్యారేజ్ ప్రాజెక్టులకు తెలంగాణ–కర్ణాటక ప్రభుత్వాలు సానుకూలంగా ముందుకొచ్చాయి.

మక్తల్‌కు మహర్దశ
X

దిశ,మక్తల్: మక్తల్ నియోజకవర్గ అభివృద్ధికి కీలక మలుపు తిప్పే రెండు అంతర్రాష్ట్ర రోడ్‌కమ్ బ్యారేజ్ ప్రాజెక్టులకు తెలంగాణ–కర్ణాటక ప్రభుత్వాలు సానుకూలంగా ముందుకొచ్చాయి. దాదాపు రూ.1000 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులకు రెండు రాష్ట్రాలు చెరి సగం నిధులు భరించేందుకు అంగీకరించడంతో పాటు నిర్మాణ ప్రాంతాలు, డిజైన్‌ల ఎంపిక కూడా పూర్తయినట్లు సమాచారం. మక్తల్ సరిహద్దుల్లోని రెండు ప్రధాన నదులపై అంతరాష్ట్ర రోడ్ కమ్ బ్యారేజీల నిర్మాణమైతే కరువు, వలసలతో వెనుకబడిన మక్తల్ ప్రాంతం అభివృద్ధి వైపు పరుగులు పెట్టే అవకాశం ఉంది.

కృష్ణాపై కోల్పూర్.. భీమాపై కుసుమూర్తి!

నియోజకవర్గ భౌగోళిక రూపురేఖలను మార్చేలా రెండు వేర్వేరు చోట్ల ఈ రోడ్ కమ్ బ్యారేజీలను నిర్మించనున్నారు. కోల్పూర్ - కొర్తికొండ బ్యారేజ్ మాగనూరు మండలం కోల్పూర్ నుంచి కర్ణాటకలోని రాయచూర్ జిల్లా కొర్తికొండ గ్రామం వరకు కృష్ణా నదిపై దీనిని నిర్మిస్తారు. ఇక్కడ దాదాపు 2 టీఎంసీల నీటిని నిల్వ చేయనున్నారు. అలాగే కృష్ణా మండలం కుసుమూర్తి నుంచి యాదగిరి జిల్లా వడిగెర తాలూకా సుగురు గ్రామాల మధ్య భీమా నదిపై దీనిని నిర్మిస్తారు. ఇక్కడ 1.5 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది.

పచ్చబడుతున్న బీడు భూములు..

ఐనపూర్ గ్రామం వద్ద భీమా నది తెలంగాణలోకి ప్రవేశించి 7 కిలోమీటర్ల మేర ప్రవహించి కృష్ణా నదిలో కలుస్తుంది. ఈ సంగమ క్షేత్రానికి కేవలం రెండు కిలోమీటర్ల ఎగువన కుసుమూర్తి బ్యారేజీని నిర్మిస్తుండటంతో ఇక్కడ అద్భుతమైన జలవనరు కేంద్రీకృతం కానుంది. కృష్ణా మండలంలోని పల్లపు ప్రాంతాలకు గ్రావిటీ (గురుత్వాకర్షణ) కాలువల ద్వారా ఎలాంటి మోటార్లు లేకుండానే వేలాది ఎకరాలకు సాగునీరు అందనుంది. ఫలితంగా దశాబ్దాలుగా ఎండిపోయిన బీడు భూములు పచ్చని పంటపొలాలుగా మారనున్నాయి. అలాగే ఈ ప్రాంతంలో శాశ్వతంగా తాగునీటి ఎద్దడి తీరనుంది.

కర్ణాటకకు జలాలు.. తెలంగాణకు వాణిజ్య లాభాలు!

కోల్పూర్ వద్ద నిర్మించే బ్యారేజీ ద్వారా నిల్వ ఉండే 2 టీఎంసీల నీటి వల్ల రాయచూర్ జిల్లాకు తాగు, సాగునీటితో పాటు అక్కడి రెండు ప్రధాన థర్మల్ విద్యుత్ కేంద్రాలకు నీటి కొరత తీరనుంది. జల లబ్ధి పరంగా కర్ణాటకకు ఎక్కువ మేలు జరిగినప్పటికీ, రవాణా, వాణిజ్య పరంగా తెలంగాణకు ఇది వర ప్రసాదంగా మారనుంది. మక్తల్ ప్రాంత రైతులకు రాయచూర్ మార్కెట్‌కు ధాన్యం, ఇతర పంటలను వేగంగా తరలించేందుకు, ప్రజల రాకపోకలకు ఈ అంతరాష్ట్ర రహదారి పక్కా వంతెనలా నిలవనుంది.

ఐదు రహదారులతో.. పారిశ్రామిక కనెక్టివిటీ

కర్ణాటక ప్రభుత్వం రాయచూర్ నుంచి యాదగిరి వరకు భారీ పారిశ్రామిక కారిడార్‌ను ప్రకటించింది. ఇప్పుడు నిర్మించబోయే రెండు రోడ్ కమ్ బ్యారేజీల వల్ల మక్తల్ నియోజకవర్గంలోని కుసుమూర్తి, చేగుంట, ఉజ్జల్లి, కోల్పూర్ ప్రాంతాలు నేరుగా ఈ పారిశ్రామిక కారిడార్‌తో అనుసంధానం కానున్నాయి. ఈ రెండు వంతెనలు పూర్తయితే మక్తల్ నుంచి కర్ణాటకకు వెళ్లే అంతరాష్ట్ర రహదారుల సంఖ్య ఐదుకు చేరుతుంది. దీంతో వ్యాపార లావాదేవీలు పెరిగి, నారాయణపేట జిల్లాలోనే మక్తల్ అగ్రగామిగా ఎదుగుతుంది. ఒకప్పుడు కరవు, వలసలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న ఈ నియోజకవర్గం.. ఇకపై ప్రగతి పథంలో పరుగులు పెట్టడం ఖాయం.

Next Story