- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గల్లీకో బెల్ట్ దుకాణం.. పల్లెల్లో ఏరులై పారుతున్న మద్యం!
జోగులాంబ గద్వాల జిల్లాలో అక్రమ మద్యం దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా పల్లెపల్లెనా వెలసిన బెల్ట్ షాపులు సామాన్యుల బతుకులను చిన్నాభిన్నం చేస్తున్నాయి.

దిశ, గద్వాల క్రైం: జోగులాంబ గద్వాల జిల్లాలో అక్రమ మద్యం దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా పల్లెపల్లెనా వెలసిన బెల్ట్ షాపులు సామాన్యుల బతుకులను చిన్నాభిన్నం చేస్తున్నాయి. ఒకప్పుడు పల్లెల్లో ప్రశాంతతకు మారుపేరుగా నిలిచిన గ్రామాలు, నేడు మద్యం మత్తులో తూగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఎక్సైజ్ శాఖ నిబంధనలు గాలికి ఎగిరిపోగా, అక్రమ మద్యం అమ్మకాలు సరిహద్దులు దాటుతున్నాయి. ఎక్సైజ్ అధికారులు కేవలం ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారా..? అన్న ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు
గద్వాల, ధరూర్, మల్దకల్, అయిజ, శాంతినగర్ వంటి మండలాల్లో బెల్ట్ షాపుల హవా కొనసాగుతోంది. ప్రతి చిన్న గ్రామంలోనూ కనీసం 5 నుంచి 10 బెల్ట్ షాపులు నడుస్తున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉదయం నుంచి మొదలుకొని అర్ధరాత్రి వైన్ షాపులు మూసేసిన తర్వాత కూడా ఇక్కడ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అధిక ధరలకు విక్రయిస్తూ.. కూలీల సంపాదనను యజమానులు గుంజేస్తున్నారు.
చిద్రమవుతున్న సంసారాలు
బెల్ట్ షాపుల వల్ల అత్యధికంగా నష్టపోతున్నది సామాన్య మహిళలే.. రోజు మొత్తం చెమటోడ్చి సంపాదించిన కూలీ డబ్బులు ఇంటికి చేరకముందే మద్యం షాపుల పాలవుతున్నాయి. దీంతో నిరుపేద కుటుంబాలు ఆర్థికంగా చితికి పోతున్నాయి. మద్యానికి బానిసైన పురుషులు ఇళ్లకు వచ్చి భార్యా పిల్లలను వేధిస్తుండటంతో గృహహింస కేసులు నిత్యకృత్యమయ్యాయి. మా గ్రామంలో బెల్ట్ షాపులు తీసేయండి అని మహిళా సంఘాలు మొత్తుకుంటున్నా అధికారుల చెవికి ఎక్కడం లేదు.
శాంతిభద్రతలకు విఘాతం
కేవలం ఆర్థికంగానే కాకుండా, సామాజికంగానూ ఈ బెల్ట్ షాపులు పెను ముప్పుగా పరిణమించాయి. మద్యం మత్తులో చిన్నపాటి గొడవలు కాస్త వర్గ పోరాటాలుగా మారుతున్నాయి. పాత కక్షలు, రాజకీయ విభేదాలు ఉన్న చోట ఈ మద్యం సెగలు మరింత ఆజ్యం పోస్తున్నాయి. పల్లెల్లో రాత్రిపూట తిరగాలంటేనే మహిళలు, వృద్ధులు భయపడే పరిస్థితి నెలకొంది.
మామూళ్ల మత్తులో యంత్రాంగం?
జిల్లాలో ఇంత బహిరంగంగా అక్రమ దందా సాగుతున్నా ఎక్సైజ్, పోలీస్ శాఖలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని ప్రజలు మండిపడుతున్నారు. ఎక్సైజ్ అధికారులు కేవలం ఆదాయమే పరమావధిగా పనిచేస్తున్నారా అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నెలవారీ మామూళ్ల మత్తులో అధికారులు తూగుతూ, కేవలం నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పట్టణాల్లోనూ ఇదే తీరు..
కేవలం గ్రామాల్లోనే కాదు, గద్వాల పట్టణంలోని పలు వార్డుల్లో కూడా బెల్ట్ షాపులు గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్నాయి. నివాస ప్రాంతాల మధ్యే మద్యం విక్రయాలు సాగుతుండటంతో మహిళలు, విద్యార్థులు అటువైపు వెళ్లడానికి భయపడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో పట్టణాల్లో సైతం మద్యం బెల్ట్ షాపులు పాగా వేశాయి.
తక్షణ చర్యలు చేపట్టాలి..
జిల్లాలో అక్రమ మద్యం దందాను అరికట్టడంలో విఫలమైతే భవిష్యత్తులో నేరాలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి బెల్ట్ షాపులను శాశ్వతంగా మూసివేయాలని, నిబంధనలు ఉల్లంఘించే వైన్ షాపుల లైసెన్సులను రద్దు చేయాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.






