కలెక్టరమ్మా రోడ్డు ప్రమాదాలను అరికట్టమ్మా..!

by Ratna Kumari |

కలెక్టరమ్మ రోడ్డు ప్రమాదాలను అరికట్టమ్మా అని 'బాధ్యత' ఆర్గనైజేషన్ ఫౌండర్ సారంగి లక్ష్మీకాంత్ విజ్ఞప్తి చేశారు.

కలెక్టరమ్మా రోడ్డు ప్రమాదాలను అరికట్టమ్మా..!
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : కలెక్టరమ్మ రోడ్డు ప్రమాదాలను అరికట్టమ్మా అని 'బాధ్యత' ఆర్గనైజేషన్ ఫౌండర్ సారంగి లక్ష్మీకాంత్ విజ్ఞప్తి చేశారు. మహబూబ్ నగర్ పట్టణంలో రోజు రోజుకూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన కలెక్టర్ ఖుష్బూ గుప్తా కు విన్నతి పత్రాన్ని సమర్పించి 'దిశ' తో మాట్లాడారు. పట్టణంలో, పట్టణ శివార్లలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగి ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారని, అనేక మంది క్షతగాత్రులు అవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. గత సంవత్సరం న్యూ టవున్ లో ఇద్దరు, ఇటీవల కోయిల్ కొండ చౌరస్తాలో ఒకరు, పిస్తా హౌస్ ముందు ఒకరు, గత 15 రోజుల క్రితం మహబూబ్ నగర్ బైపాస్ లో ఒక విశ్రాంత ఉద్యోగి, ఆదివారం రాత్రి బైపాస్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 6 మంది చనిపోవడం తీవ్ర విషాదానికి గురి చేస్తుందని, ఇలా నిత్యం ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని ఆయన విచారం వ్యక్తంచేశారు. ఇంత పెద్ద జిల్లా యంత్రాంగం ఉండి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు చేపట్టకపోవడం బాధాకరమని ఆయన వాపోయారు. వెంటనే బైపాస్ రోడ్డులో జరిగే ప్రమాదాల నివారణకు కలెక్టర్, జిల్లా ఎస్పీ లు కఠిన చర్యలు చేపట్టాలని లక్ష్మీకాంత్ విజ్ఞప్తి చేశారు.

Next Story