- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆలూరులో భూ వివాదం.. వదినపై మరిది కత్తితో దాడి
భూమి విషయంలో ఏర్పడిన మనస్పార్థాలతో మరిది.. వదినపై విచక్షణ రహితంగా కత్తితో దాడి చేసి గాయపరిచాడు.

దిశ, గద్వాల క్రైమ్/ గట్టు : జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఆలూరు గ్రామ శివారులో బుధవారం భూ వివాదం చిలికి చిలికి గాలివానలా మారి ఘర్షణకు దారితీసింది. భూమి విషయంలో ఏర్పడిన మనస్పార్థాలతో మరిది మల్లేష్ తన వదిన కుమ్మరి రాణి పై విచక్షణారహితంగా కత్తితో దాడి చేసి గాయపరిచాడని బాధితురాలు తెలిపింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన కుమ్మరి హనుమంతుకు ఇద్దరు కుమారులు సవరన్న , మల్లేష్. పెద్ద కుమారుడు సవరన్న కిడ్నీ సంబంధిత వ్యాధితో గతంలోనే మృతి చెందాడు. అతనికి ఒక కూతురు ఉంది. తండ్రి వారసత్వంగా వచ్చే ఆస్తి విషయంలో సవరన్న బతికున్నప్పుడే తన కూతురికి చెందేలా నోటరీ ద్వారా అగ్రిమెంట్ చేయించుకున్నారు.
సవరన్న మరణానంతరం సదరు భూమి విషయంలో సోదరుడు మల్లేష్‌తో వివాదం మొదలైంది. ఈ విషయమై గతంలో గ్రామ పెద్దల సమక్షంలో, పోలీస్ స్టేషన్‌లో పలుమార్లు పంచాయతీలు నిర్వహించినా సమస్య పరిష్కారం కాలేదు. బుధవారం రాణి తన కూతురికి రావాల్సిన పొలం వద్దకు వెళ్లగా, అక్కడకు చేరుకున్న మరిది మల్లేష్ ఆమెతో గొడవకు దిగాడు. అసభ్య పదజాలంతో దూషిస్తూ, చంపేస్తానని బెదిరిస్తూ ఒక్కసారిగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రాణిని స్థానికులు గద్వాల ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. న్యాయపరంగా తనకు రావాల్సిన భూమిని ఇప్పించాలని, తనపై ప్రాణాంతక దాడికి పాల్పడిన మల్లేష్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితురాలు కోరుతోంది.






