జడ్చర్లలో కాంగ్రెస్ బలం పెరుగుతోంది.. అధికార పార్టీలోకి కీలక నేతలు

by Bhanu |   (  Updated:2025-07-18 05:02:12  IST  )

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీలో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఆధీనంలో కొనసాగిన మున్సిపాలిటీ పాలకవర్గంలో కీలక నాయకులు

జడ్చర్లలో కాంగ్రెస్ బలం పెరుగుతోంది.. అధికార పార్టీలోకి కీలక నేతలు
X

దిశ, జడ్చర్ల : మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీలో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఆధీనంలో కొనసాగిన మున్సిపాలిటీ పాలకవర్గంలో కీలక నాయకులు పార్టీకి వీడ్కోలు పలికేందుకు సిద్ధమయ్యారు. మున్సిపల్ చైర్‌పర్సన్ కోనేటి పుష్పలత, బీఆర్ఎస్ కౌన్సిలర్ ఉమా వెంకటేష్, బీజేపీకి చెందిన లలితా నాగరాజు కాసేపట్లో అధికార కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సమక్షంలో వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు.

సీఎం స్వయంగా వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత జడ్చర్ల మున్సిపాలిటీ రాజకీయాల్లో మార్పులు ప్రారంభమయ్యాయి. లక్ష్మి రవీందర్ చైర్‌పర్సన్ పదవికి వైదొలిగిన తర్వాత, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సలహాల మేరకు కోనేటి పుష్పలత ఆ స్థానానికి ఎంపికయ్యారు.

ఇతర పార్టీల నాయకులను కాంగ్రెస్‌లోకి చేర్చుకునే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ముందుగా స్పష్టం చేసినా, తాజా పరిణామాలు ఆ మాటలకు విరుద్ధంగా ఉండటం గమనార్హం. చైర్‌పర్సన్ సహా ఇద్దరు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న దృశ్యం ఇప్పుడు జడ్చర్లలో హాట్ టాపిక్‌గా మారింది.

Next Story