విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా..?

by Ratna Kumari |

దిశ, నారాయణపేట క్రైమ్ : నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద విద్యార్థుల రవాణా సమస్యలపై ప్రశ్నించినందుకు విద్యార్థి సంఘ నాయకులు,

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా..?
X

దిశ, నారాయణపేట క్రైమ్ : నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద విద్యార్థుల రవాణా సమస్యలపై ప్రశ్నించినందుకు విద్యార్థి సంఘ నాయకులు, జర్నలిస్టులపై నాన్‌బెయిల్ కేసులు నమోదు చేయడం తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఈ నెల 17న నారాయణపేట బస్టాండ్ నుంచి ఆయా గ్రామాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాత్రి ఎనిమిదైనా బస్సులు రాకపోవడంతో బాలికలతో సహా పలువురు విద్యార్థులు ఆకలితో అలమటించారు. ఈ విషయాన్ని గమనించిన విద్యార్థి సంఘాలు బస్సులు వెంటనే ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను డిమాండ్ చేశారు. ఎన్ని సార్లు కోరినా డిపో మేనేజర్ స్పందించకపోవడంతో, గ్రామాలకు వెళ్లాల్సిన విద్యార్థులతో కలిసి పీడీఎస్‌యూ రాష్ట్ర నాయకులు సాయికుమార్, నరహరితో పాటు ఏబీవీపీ నాయకులు బస్టాండ్ వద్ద రాస్తారోకో నిర్వహించారు.

ఈ ఘటన అనంతరం డిపో మేనేజర్ ఫిర్యాదు మేరకు పీడీఎస్‌యూ రాష్ట్ర నాయకులు సాయికుమార్, పవన్, ఏబీవీపీ నాయకులతో పాటు ఘటనను కవరేజ్‌కు వచ్చిన రిపోర్టర్లపై నాన్‌బెయిల్ కేసులు నమోదు చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. విద్యార్థుల సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు పెట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విద్యార్థి సంఘాలు పేర్కొన్నాయి. ప్రశ్నించే గొంతులను బెదిరించడం, స్వేచ్ఛను హరించడం సరైన పద్ధతి కాదని ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసే జర్నలిస్టులపై కూడా కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నారాయణపేట డిపో మేనేజర్ తీరుతో గత కొంతకాలంగా విద్యార్థులు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆందోళనలు చేస్తే తప్ప బస్సు సౌకర్యం కల్పించని పరిస్థితి నెలకొందని ఆరోపించారు. ఈ ఘటనను సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ పార్టీ తీవ్రంగా ఖండించింది. విద్యార్థి సంఘ నేతలు, జర్నలిస్టులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని, విద్యార్థుల రవాణా సమస్యలను పరిష్కరించి వారి సమయానికి బస్సులు నడపాలని డిమాండ్ చేసింది. అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు ప్రశ్నించడం సహజమని, కక్షసాధింపు చర్యలు ప్రజాస్వామ్యంలో తగవని స్పష్టం చేసింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ ఘటనను తాత్కాలికంగా పరిగణించి సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. ఇదిలా ఉండగా జర్నలిస్టులపై తప్పుడు కేసులు పెట్టేందుకు సాక్ష్యంగా ఓ ప్రధాన పత్రికలో తప్పుడు వార్త రాయించడాన్ని పేట జిల్లా జర్నలిస్టులు వ్యతిరేకిస్తున్నారు.

Next Story