అరకొరగా వెంటిలేటర్ బెడ్స్

by Batti.Sumithra |

నాగర్ కర్నూల్ జిల్లా జనరల్ ఆసుపత్రి ఐసీయూ విభాగంలో సరిపడ బెడ్స్ లేక వైద్యులు రోగులను బయటకి పంపుతున్నారు.

అరకొరగా వెంటిలేటర్ బెడ్స్
X

దిశ, కందనూల్ : నాగర్ కర్నూల్ జిల్లా జనరల్ ఆసుపత్రి ఐసీయూ విభాగంలో సరిపడ బెడ్స్ లేక వైద్యులు రోగులను బయటకి పంపుతున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంగా ఏర్పడి దాదాపు 9 సంవత్సరాలు కావస్తున్నా జిల్లా ఆస్పత్రిలో పూర్తి వసతులు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. జిల్లా ఆస్పత్రిని మూడు సంవత్సరాల క్రితం మెడికల్ కళాశాలగా ఏర్పాటు చేసినప్పటికీ వసతులు మెరుగు పడలేదు. 130 బెడ్ల నుంచి 300 బెడ్ల వరకు పెంచి జిల్లా ఆసుపత్రి ఏర్పాటు చేసినప్పటికీ అత్యవసర పరిస్థితుల్లో ఐసీయూ విభాగంలో అవసరమయ్యే ఆక్సిజన్, వెంటిలేటర్ సౌకర్యం ఉన్న బెడ్లు సరిపోను లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి వస్తున్న రోగులు ఇబ్బందులు పడుతున్నారు. బెడ్లులేని కారణంగా మహబూబ్‌నగర్, హైదరాబాద్ ఆస్పత్రులకు డాక్టర్లు రిఫర్ చేయడంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పేషెంట్లు పరుగు తీస్తున్నారు. ఆర్థిక పరిస్థితి బాగాలేని పేదలు ఇక్కడ నుంచి తరలించేందుకు అంబులెన్స్ ఖర్చులు సహాయం చేయలేక ఇబ్బందుల పాలవుతున్నారు. జనరల్ ఆస్పత్రిగా ఏర్పడినప్పటికీ పూర్తిస్థాయిలో సౌకర్యాలు లేకపోవడంతో నమ్మకంతో ఆస్పత్రికి వచ్చిన రోగులు ఆందోళన చెందుతున్నారు.

తాజాగా మంగళవారం రాత్రి పెద్దకొత్తపల్లి మండలం కల్వకోలు గ్రామానికి చెందిన నరసయ్యను బంధువులు చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తీసుకురాగా డాక్టర్లు అత్యవసర విభాగంలో వెంటిలేటర్, ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో లేవని పేషెంటును మహబూబ్‌నగర్ ఆసుపత్రికి వెళ్లాలని రిఫర్ చేశారు. తమ ఆర్థిక పరిస్థితి బాగోలేకనే ఇక్కడకు వచ్చామని ఇక్కడే చికిత్స చేయాలని పేషంటు బంధువులు కోరగా తాము చేసేది ఏదీ లేదంటూ వైద్యులు చేతులెత్తేశారు. రోగిని చాలాసేపటి వారు స్ట్రెచర్ పైనే ఉంచి ఆక్సిజన్ అందించారు. దీంతో ఏమి చేయాలో తెలియక బంధువులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పేషెంట్ బంధువులు తమ గోడును వెళ్ళబోసుకొని ప్రాధేయపడగా స్పందించిన డ్యూటీ డాక్టర్లు ఐసీయూలో వెంటి లెటర్ అవసరం లేని ఒక పేషెంట్ ను ఏఎంసీ వార్డుకు తరలించి వెంటిలేటర్ బెడ్ ను ఆ పేషేంట్ కోసం ఏర్పాటు చేశారు. ఐసీయూ విభాగంలో బెడ్లు తక్కువగా ఉండడంతో ఎమర్జెన్సీ సమయంలో ఆసుపత్రికి వచ్చే పేషెంట్లు తరచుగా ఇబ్బంది పడుతున్నారని, అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి అదనపు బెడ్లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story