- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో తవ్వకం..కర్ణాటకలో డంపింగ్
తెలంగాణ–కర్ణాటక సరిహద్దున పెద్దవాగు పరివాహక ప్రాంతం ఇసుక అక్రమ తరలింపునకు కేంద్రంగా మారింది.

తెలంగాణలో తవ్వకం..కర్ణాటకలో డంపింగ్
- అర్ధరాత్రి వేళ రెచ్చిపోతున్న ఇసుక మాఫియా
- సరిహద్దు ప్రాంతాల్లో డంపులు, జోరుగా అక్రమ రవాణా
దిశ, ఊట్కూర్: తెలంగాణ–కర్ణాటక సరిహద్దున పెద్దవాగు పరివాహక ప్రాంతం ఇసుక అక్రమ తరలింపునకు కేంద్రంగా మారింది. పగలు ప్రశాంతంగా కనిపిస్తున్నా, రాత్రి వేళల్లో అక్రమార్కులు తమ పని కానిచ్చేస్తున్నారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నట్లు సరిహద్దు ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల నిఘా తక్కువగా ఉన్న సమయాన్ని చూసి ఈ అక్రమ రవాణా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి నుంచి ఇసుకను కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో డంప్ చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ అధికారులు అక్కడికి వచ్చి స్వాధీనం చేసుకునే వీలుండదని భావించే అక్రమార్కులు ఈ ఎత్తుగడ వేస్తున్నారు. అనంతరం అక్కడి నుంచి తెలంగాణలోని నిర్మాణ పనులకు తరలిస్తున్నట్లు సమాచారం.
అర్ధరాత్రి నుంచే అసలు కథ..
పోలీసులు, రెవెన్యూ అధికారుల నిఘా తక్కువగా ఉండే అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ఈ దందా నిరాటంకంగా సాగుతోంది. భారీ వాహనాలతో పాటు సమీప గ్రామాల్లోని ఎద్దుల బండ్ల ద్వారా ఇసుకను కొల్లగొడుతున్నారు. అధికారులు దాడులు చేసినప్పుడు ఆగిపోయినట్లు కన్పించినా కొద్దిరోజులకే మళ్లీ కొనసాగిస్తున్నారు. నాగిరెడ్డిపల్లి రీచ్ పరిసరాల్లో కూడా నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు సాగుతున్నట్లు సమాచారం.
రైతులలో ఆందోళన...
ఈ అక్రమ తవ్వకాలపై సరిహద్దు ప్రాంత రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాగులో ఇసుకను ఇష్టానుసారంగా తోడేయడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని, ఇది భవిష్యత్తులో వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వాపోతున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, రాత్రి వేళల్లో పెట్రోలింగ్ పెంచితేనే ఈ దందాను అరికట్టడం సాధ్యమవుతుందని రైతులు డిమాండ్ చేస్తున్నారు.






