ఉమ్మడి జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకపోతే ప్రజా ఉద్యమమే

by Ratna Kumari |

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకపోతే ఉద్యమబాట పడతామని 'ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ' చైర్మెన్ జి.రాజేందర్ రెడ్డి హెచ్చరించారు.

ఉమ్మడి జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకపోతే ప్రజా ఉద్యమమే
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకపోతే ఉద్యమబాట పడతామని 'ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ' చైర్మెన్ జి.రాజేందర్ రెడ్డి హెచ్చరించారు. గురువారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని ప్రాజెక్టుల పేరు మీద ఎన్నికల సమయంలో అన్ని రాజకీయ పార్టీలు పాలమూరు ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. నల్లగొండ రాజకీయ నాయకులు కొత్తగా డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పథకం తెచ్చి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నీటిని తరలించుకపోతామంటే ప్రజా ఉద్యమమే జరుగుతుందని ఆయన హెచ్చరించారు. ఈ పథకం ద్వారా నల్లగొండ జిల్లాలో 3 లక్షల 36 వేల 540 ఎకరాలకు నీరు పారుతుందని, మహబూబ్ నగర్ జిల్లాలో 24,400 ఎకరాలకే నీటిని పారించి జిల్లా రైతాంగాన్ని మోసం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.


రాష్ట్రం ఏర్పడిన తర్వాతి మొదటి పాలకులు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కు శ్రీశైలం నుండి నీళ్ళు తీసుకురావాలనే ఆలోచనతో ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల ప్రజలను మోసం చేశారని ఆయన విమర్శించారు. నార్లాపూర్, ఎదుల, కరివెన, లక్ష్మిదేవపల్లి పనులు 50 శాతం కూడా పూర్తి కాలేదని, ఉద్దండాపూర్ రిజర్వాయర్ పనులు10 శాతం కూడా కాలేదని ఆయన విమర్శించారు. 40 టిఎంసీ ల నీటితో శ్రీశైలం రిజర్వాయర్ వెనుక జలాల నుండి 3 దశల్లో నీటిని ఎత్తిపోసి, దాదాపు 4 లక్షల ఎకరాలకు అందించే కల్వకూర్తి ఎత్తిపోతల పథకం 2005 మొదలుపెట్టి నేటి వరకు పూర్తి చేయలేదని ఆయన ఎత్తి పొడిచారు. వెంటనే ఈ నీటి దోపిడీ అరికట్టి ఉమ్మడి జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కోరారు. పాలమూరు అద్యాయన వేదిక కన్వీనర్ ఎం.రాఘవాచారి మాట్లాడుతూ, జిల్లాలో ప్రాజెక్టులను పూర్తి చేయక, సాగునీరు అందక పాలమూరు జిల్లా ఎడారిగా మారే ప్రమాదం దాపురించిందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. త్వరలో ఉద్యమ కార్యాచరణ రూపొందించనున్నట్లు ఆయన తెలిపారు. ముందుగా ఉమ్మడి జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన జెఎసి చైర్మెన్ గా రాజేందర్ రెడ్డి ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో తిమ్మప్ప, ఖలీల్, చెన్నకిష్టయ్య, వీరబ్రహ్మచారి, హానీఫ్ అహ్మద్, గౌస్, తదితరులు పాల్గొన్నారు.

Next Story