ఊపిరి తీస్తున్న రోడ్డు ప్రమాదాలు.. కరువైన అవగాహన

by Web Desk |
ఊపిరి తీస్తున్న రోడ్డు ప్రమాదాలు.. కరువైన అవగాహన
X

దిశ, కల్వకుర్తి : ఏళ్ళు గడుస్తున్నా రోడ్డు ప్రమాదాల సమస్య వీడడం లేదు. నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో మృతులు, క్షతగాత్రుల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంటోంది. ఏది ఏమైనా ప్రాణం విలువ వెలకట్టలేనిది. తల్లిదండ్రుల పుత్ర శోకాన్ని ఎవరు తగ్గించలేరు. వారి కుటుంబ లోటును ఎవరు పూడ్చలేరు. ఉదయం ఇంటి నుండి బయలుదేరామా..? సాయం కాలం ఇంటికెళ్లేదాకా మనిషి జీవితానికి భద్రత లేకుండా పోయింది. రోడ్డు ప్రమాదంలో ఒక్కొక్కసారి ఎంత జాగ్రత్త వ్యవహరించినా మృత్యువు ఏ సమయంలో ఎలా వస్తుందో తెలియని పరిస్థితి. కేవలం వాహనదారులే ప్రమాదాలకు గురి కాకుండా ఒక్కొక్కసారి అమాయక పాదాచారులు వాహనాలకు బలైపోతున్నారు.

ముఖ్యంగా మూల మలుపులు, అజాగ్రత్తగా నడపటం వంటివి ప్రమాదాలకు ప్రధాన కారణమని చెప్పవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో,రహదారులలో సరైన ట్రాఫిక్‌ సిగ్నల్‌ లేకపోవటంతో పలువురు చనిపోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. చెవిలో ఇయర్‌ ఫోన్‌ పెట్టుకొని పాటలు వింటూ బైక్ డ్రైవింగ్‌ చేయడం, హెల్మెట్‌ లోపల సెల్‌ ఫోన్‌ పెట్టుకొని కనిపించకుండా మాట్లాడటం వల్ల డ్రైవింగ్‌పై ఏకాగ్రత తగ్గి వాహన చోదకులకు ప్రమాదాలు పరిపాటిగా మారాయి.

కల్వకుర్తి పట్టణంలో

పట్టణంలోని పాలమూర్ ఛౌరస్తాలో జాతీయ రహదారి వెడల్పులో లోపం జరిగి అస్తవస్త్యంగా ఉండటంతో అక్కడ రోడ్డు పరిస్తితి దినదిన గండంలా మారింది. గతంలో రెండు మరణాలు చోటు చేసుకున్నాయి. గత మూడు రోజుల క్రితం పాలమూర్ చౌరస్తాలో ప్రమాదాలు సంభవిస్తున్నాయని స్థానిక పోలీసులు రెండు బారి కేడ్లతో బస్ స్టాండ్ నుండి కూడలికి వచ్చే దారిని మూసివేయడంతో ప్రమాదాల సంఖ్య కాస్త తగ్గింది. అలాగే మహబూబ్ నగర్ నుంచి పాలమూర్ కూడలికి వచ్చే జాతీయ రహదారి యు ఆకారంలో మూలమలుపు ఉండటం, నిరంతరంగా భారీ వాహనాల రాకపోకలు కొనసాగుతుండటంతో తరచూ ఏమరపాటు ప్రమాదాలు సంభవిస్తున్నాయి.

ప్రాణ నష్టం వాటిల్లక ముందే నాగర్ కర్నూల్, పాలమూర్ కూడలిలో రబ్బరు డివైడర్లు వేయడం ద్వారా వేగంతో వస్తున్న వాహనాలకు బ్రేక్ పడి చౌరస్తాలో మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. పాలమూర్ చౌరస్తాలో పలు వాహనాలు రోడ్డుకు అడ్డంగా నిలపడంతో పాదచారులు, వాహన దారులకు తలనొప్పిగా మారింది. నిబంధనలు తుంగలో తొక్కే వాహన చోదకులపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి నేషనల్ హైవే, పోలీస్ అధికారులు దీనిపై దృష్టి సారించి వీలైనంత త్వరలో డివైడర్లు వేసి పట్టణ వాసుల ప్రాణాలు కాపాడాలని మేధావులు అంటున్నారు.

రోడ్డు ప్రమాదాలు

రోడ్డు ప్రమాదాలనేవి చాలా రకాలుగా జరుగుతున్నాయి. అజాగ్రత్త, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, అతివేగం, శీతా కాలంలో ఏర్పడే మంచువలన రహదారులు సరిగ్గా కనబడక పోవడం, తెల్లవారుజామున నిద్ర మత్తులో వాహనాలు నడపడం, అనుకోకుండా ఏదైనా అకస్మాత్తుగా వాహనాలకు అడ్డురావడం, రోడ్డు భద్రత విద్యకు సంబంధించిన జ్ఞానం లేకపోవడం, అనుకోకుండా వాహనంలో ఏవైనా సమస్యలు ఏర్పడటం, రహదారులు సక్రమంగా ఉండకపోవడం లాంటి కారణాల వల్ల ప్రమాదాలు జరిగితే, ఒక్కొక్కసారి ఎదుటివాహనం అజాగ్రత్త కారణంగా ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలూ చాలా జరుగుతున్నాయి.

పరిమితికి మించి ప్రయాణం

ముగ్గురు ఎక్కే ఆటోలో పదిమందిని ఎక్కించడం, ఇద్దరెక్కే మోటార్‌ సైకిలుపై నలుగురైదుగురు ఎక్కడం, హెల్మెట్‌, సీట్‌బెల్ట్‌ పెట్టుకోకపోవడం, రోడ్డు భద్రత నియమాలు పాటించకపోవడం, తాగి వాహనం నడపడం, మొబైల్‌లలో మాట్లాడుతూ వాహనం నడపడం, అస్తవ్యస్థమైన రోడ్లు, ఇలాంటి సందర్భాల్లో రోడ్డు ప్రమాదాలకు గురై ఎంతో మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ప్రమాదాలు ఎక్కువగా విశాలమైన నాలుగు మార్గాల రోడ్డు, ఔటర్‌ రింగు రోడ్డులపై జరుగుతుంటాయి. లక్షలు, లక్షలు పెట్టి వాహనాలు తీసుకొని నిదానంగా వెళ్లకుండా అతివేగంతో వెళ్లి రెప్పపాటు క్షణంలో నియంత్రణ కోల్పోయి, ఏం జరుగుతుందో అని ఆలోచించకముందే ప్రమాదాలు జరిగి ప్రాణాలను కోల్పోతున్నారు.

జాగ్రత్త వహించాలి

మితిమీరిన వేగం.. హెల్మెట్ లేకపోవడం, మద్యంసేవించి వాహనాలు నడపటం, సెల్‌ఫోన్‌ లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వంటి పలు కారణాలతో చాలా మంది రోడ్డు ప్రమాదాల్లో అర్ధాంతరంగా ప్రాణాలు వదులుతున్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నియమాలు పాటించాలి. ఆపకుండా ఎక్కువ దూరం వాహనాన్ని నడపడం, నిద్రలేమి, ఇతర కారణాల వలన అలసట వంటి వాటి వలన వాహన చోదకుని ఏకాగ్రత దెబ్బ తింటుంది. కనుక ప్రతి రెండు గంటల తరువాత కనీసం 15 నిమిషాలు విశ్రాంతి తీసుకోవడం మంచిది. ద్విచక్రవాహన దారులు తప్పనిసరిగా హెల్మట్‌ ధరించాలి. పోలీసు శాఖ అన్ని చర్యలు చేపడుతున్నా కొందరి నిర్లక్ష్యం కారణంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. మద్యం తాగి వాహనాలు నడపడం కూడా ప్రమాదాలకు కారణం. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి ఇంటి యజమాని అయితే ఆ కుటుంబం రోడ్డున పడుతుందని తెలుసుకోవాలని డీఎస్పీ తెలిపారు.



Next Story

Most Viewed