ఓట్ల లెక్కింపున‌కు పటిష్ట భారీ బందోబస్తు

by Ratna Kumari |   (  Updated:2026-02-12 13:13:47  IST  )

మహబూబ్‌ నగర్ కార్పొరేషన్, భూత్పూర్, దేవరకద్ర మున్సిపాలిటీలకు సంబంధించిన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ శుక్రవారం స్థానిక పాలమూరు యూనివర్సిటీ లో నిర్వహించనున్న దృష్ట్యా విస్తృత స్థాయిలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ జానకి తెలిపారు.

ఓట్ల లెక్కింపున‌కు పటిష్ట భారీ బందోబస్తు
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : మహబూబ్‌ నగర్ కార్పొరేషన్, భూత్పూర్, దేవరకద్ర మున్సిపాలిటీలకు సంబంధించిన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ శుక్రవారం స్థానిక పాలమూరు యూనివర్సిటీ లో నిర్వహించనున్న దృష్ట్యా విస్తృత స్థాయిలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ జానకి తెలిపారు. గురువారం స్థానిక బండమీదిపల్లి లోని పాలమూరు యూనివర్సిటీ లో పోలీస్ అధికారులు, సిబ్బంది తో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా 480 మంది పోలీసు సిబ్బందితో మూడంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు. లెక్కింపు కేంద్రం పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం 6 గంటల నుండి శనివారం ఉదయం 6 గంటల వరకు 163 బిఎన్ఎస్ఎస్(144 సెక్షన్) నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని ఆమె తెలిపారు. లెక్కింపు కేంద్రానికి హాజరయ్యే అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు జిల్లా ఎన్నికల అధికారి జారీచేసిన గుర్తింపు కార్డులు తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు. అగ్గిపెట్టెలు, లైటర్లు, ఇంక్ బాటిల్స్, పేలుడు పదార్థాలు లేదా భద్రతకు ముప్పు కలిగించే ఏవైనా వస్తువులు లెక్కింపు కేంద్రంలోకి తీసుకురావడం పూర్తిగా నిషేధమని, తనిఖీలు నిర్వహించే భద్రతా సిబ్బందికి పూర్తి సహకారం అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఫలితాల అనంతరం ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు, బైక్ ర్యాలీలు, డీజే లు, టపాకాయలు కాల్చడం వంటి కార్యక్రమాలకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేసి రిమాండ్‌ కు పంపిస్తామని హెచ్చరించారు. లెక్కింపు కేంద్రాల వద్ద ప్రత్యేక బందోబస్తు, క్యూఆర్‌ టీం లు, డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీములు, స్ట్రైకింగ్ ఫోర్సులు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ఎన్నికలు జరిగిన ముఖ్యమైన ప్రాంతాల్లో చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన పహారా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీలు ఎన్బీ రత్నం, సురేష్ కుమార్, డిఎస్పీ లు వెంకటేశ్వర్లు, గిరిబాబు, రమణారెడ్డి, రూరల్ సీఐ గాంధీ నాయక్ ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Next Story