నేటి నుంచి TPCC చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర.. కాంగ్రెస్‌లో జోష్ తెచ్చేనా..?

by Disha Web |
నేటి నుంచి TPCC చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర.. కాంగ్రెస్‌లో జోష్ తెచ్చేనా..?
X

దిశ బ్యూరో, మహబూబ్ నగర్: కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర స్ఫూర్తితో సోమవారం నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సారథ్యంలో సాగనున్న హాథ్ సే హాథ్ కార్యక్రమాన్ని ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రారంభించేందుకు పార్టీ శ్రేణులు సన్నద్ధం అవుతున్నాయి. అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, వాటి అమలు తీరు, ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, తదితర స్థానిక అంశాలతో పాటు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకురావడం, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య మరింత సఖ్యతను కుదిర్చి ప్రజలకు చేరువ అయ్యే విధంగా హాథ్ సే హాథ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అయితే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మొదటి విడత యాత్ర ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రవేశించేది కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఉమ్మడి జిల్లాలో పలు నియోజకవర్గాల్లో పార్టీ నేతల మధ్య సఖ్యత కొరవడింది. ఎవరికి వారుగా కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో హాథ్ సే హాథ్ యాత్ర విజయవంతం అవుతుందో లేదో చూడాలి.

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సారథ్యంలో సోమవారం నుంచి 60 రోజుల పాటు కొనసాగనున్న హాథ్ సే హాథ్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల మండలాలు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇంటింటికి తిరిగి ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే ప్రధాన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించనున్నారు.

వాళ్లు చేతులు కలుపుతారా..!?

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది నేతలు వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయాలన్న ఆశతో ఉన్నారు. నేతలు ఎవరికి వారు అన్న చందంగా వ్యవహరిస్తున్న కారణంగా పార్టీ పరిస్థితులు ఆగమ్య గోచరంగా మారాయి. ప్రత్యేకించి జడ్చర్లలో పీసీసీ ఉపాధ్యక్షుడు ఎర్రశేఖర్, పీసీసీ కార్యదర్శి అనిరుధ్ రెడ్డి మధ్య ఏమాత్రం సఖ్యత లేదు. ఇద్దరు ఎవరికి వారుగా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలను సాగిస్తున్నారు తప్ప కలిసి పనిచేసిన దాఖలాలు లేవు. కొల్లాపూర్ నియోజకవర్గంలోనూ పీసీసీ ప్రధాన కార్యదర్శి అభిలాష రావు, సీనియర్ నేత జగదీశ్వర్ రావు మధ్య సఖ్యత కొరవడింది.

అధిష్టానం వీరిద్దరి మధ్య సయోధ్య కుదిరించే విధంగా సలహాలు సూచనలు చేసినప్పటికీ అనుచరులు మాత్రం ఎవరికి వారుగానే కార్యక్రమాలను నిర్వహించడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. వనపర్తి లోనూ మాజీ మంత్రి చిన్నారెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. దేవరకద్ర నియోజకవర్గంలో డీసీసీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, సీనియర్ నేత ప్రదీప్ గౌడ్, మక్తల్ నియోజకవర్గంలో డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి, పీసీసీ సభ్యుడు ప్రశాంత్ రెడ్డి మధ్య కూడా సఖ్యత లేక కార్యక్రమాలు ఎవరికి వారుగా నిర్వహిస్తున్నారు. కాగా నారాయణపేట, కల్వకుర్తి నియోజకవర్గాలలో పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే నేతలు లేక కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు. ఇటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య సఖ్యత కుదిరి ప్రజల వద్దకు వెళితేనే అంతో ఇంతో నమ్మకం కుదిరే అవకాశాలు ఉన్నాయి. ఎవరికి వారీగా కార్యక్రమాలను నిర్వహించడం వల్ల ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం లేకపోలేదు.

రేవంత్ పాదయాత్ర జిల్లాకు రాకపోవచ్చు

హాథ్ సే హాథ్ కార్యక్రమంలో భాగంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మొదటి విడతగా 60 రోజులపాటు రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో కనీసం సగం అసెంబ్లీ నియోజకవర్గాల గుండా తమ పాదయాత్రను నిర్వహించాలని ప్రణాళికలను సిద్ధం చేసుకున్నప్పటికీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆ యాత్ర ప్రవేశించేది కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర సాగని జిల్లాలలో హాథ్ సే హాథ్ పాదయాత్రను కొనసాగించాలని అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం.

ఈ కారణంగా ఉత్తర తెలంగాణలో రేవంత్ యాత్ర సాగవచ్చు అని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఈ కారణంగా మొదటి విడతలో పాదయాత్ర సాగే జిల్లాలలో ఉమ్మడి పాలమూరు జిల్లా ఉండకపోవచ్చు అని ఆ పార్టీ శ్రేణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఉంటే రాహుల్ గాంధీ యాత్ర సాగని నియోజకవర్గాలలో రేవంత్ రెడ్డి యాత్ర కొనసాగే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.

ఇంతకన్నా అవకాశం మళ్లీ రాదు

ప్రజలకు చేరువ కావడానికి మాకు ఇంతకన్నా మంచి అవకాశం మున్ముందు రాకపోవచ్చు. నాగర్ కర్నూల్ జిల్లాలో అన్ని నియోజకవర్గాలలో ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరూ వారి వారి నియోజకవర్గాలలో హాథ్ సే హాథ్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు చర్యలు చేపట్టాం. ఆయా మండలాల కమిటీలు కార్యక్రమాలను ముందుకు తీసుకువెళుతాయి.

వంశీకృష్ణ, డీసీసీ అధ్యక్షుడు, నాగర్ కర్నూల్ జిల్లా

అన్ని మండలాలలో సాగుతుంది

హాథ్ సే హాథ్ కార్యక్రమం జిల్లాలోని అన్ని మండలాలలో సోమవారం నుంచి ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల వద్దకు తీసుకువెళ్తాం.. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ఇదో మంచి అవకాశం. కలిసికట్టుగా జనాల్లోకి వెళతాం.

శ్రీహరి, డీసీసీ అధ్యక్షుడు, నారాయణపేట జిల్లా
Next Story

Most Viewed