- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాలమూరు కాంగ్రెస్‌లో ‘గ్రూపు’ రాజకీయం
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలు! వనపర్తి, గద్వాల, మహబూబ్ నగర్‌లో నేతల మధ్య ఆధిపత్య పోరు. అధిష్టానం కట్టడి చేయకుంటే నష్టం తప్పదని హెచ్చరిక.

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మూడు కీలక అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పరాకాష్టకు చేరుకున్నాయి. గద్వాలలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరితాతిరుపతయ్య మధ్య విభేదాలు కొనసాగుతుండగా, వనపర్తిలో ఎమ్మెల్యే మేఘారెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ చిన్నారెడ్డి మధ్య ఆధిపత్య పోరు సాగుతుంది. ఇప్పటికే ఈ రెండు నియోజకవర్గాల వ్యవహారం అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. తాజాగా మహబూబ్ నగర్ నియోజకవర్గంలోనూ నేతల మధ్య వర్గ పోరు మొదలవ్వడంతో పార్టీ కేడర్ తీవ్ర అయోమయానికి గురవుతోంది. ఎవరికి వారు తామే పెద్దలమంటూ వ్యవహరిస్తుండడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తోంది.
అదును కోసం ఎదురుచూపులు..
వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల సమయం నుంచే ఎమ్మెల్యే మేఘారెడ్డి, డాక్టర్ చిన్నారెడ్డి వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఈ విభేదాల వల్లే పార్టీ కొంత నష్టపోయినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అధిష్టానం జోక్యంతో ప్రస్తుతం ఇరువురు నేతలు పైకి శాంతించినట్లు కనిపిస్తున్నా, అనుచరుల మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం సాగుతూనే ఉంది. మరోవైపు గద్వాలలో ఎమ్మెల్యే బండ్ల రాకను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న సరితాతిరుపతయ్య, మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గానికి ప్రాధాన్యత దక్కకపోవడంతో గుర్రుగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె మౌనంగా ఉన్నప్పటికీ, సరైన సమయం కోసం వేచి చూస్తున్నట్లు సమాచారం.
పాలమూరులో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు..
మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల మధ్య సమన్వయం పూర్తిగా లోపించింది. ప్రభుత్వ విప్ ఎన్నం శ్రీనివాస్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ మధ్య ఆధిపత్య పోరు నిత్యకృత్యమైంది. వీరు ప్రధానంగా రెండు వర్గాలుగా విడిపోవడమే కాకుండా, అంతర్గతంగా మరికొన్ని గ్రూపులు కట్టి సొంత పైరవీలు చేసుకుంటున్నారు. ఒక ముఖ్య నేత నిర్వహించే కార్యక్రమాలకు మరో నేత గానీ, ఆయన అనుచరులు గానీ హాజరుకాకపోవడం పార్టీలోని చీలికను స్పష్టం చేస్తోంది. నేతల మధ్య ఉన్న ఈ గ్యాప్ వల్ల క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఎవరి వెంట వెళ్లాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు.
అధిష్టానం కట్టడి చేయాలి
ఉమ్మడి జిల్లాలో పార్టీ బలంగా ఉన్నప్పటికీ, నేతల మధ్య ఉన్న ఇగోలు పార్టీకి నష్టం చేకూర్చేలా ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్యే మేఘా రెడ్డి ఆధ్వర్యంలో కొన్నిచోట్ల మెరుగైన ఫలితాలు వచ్చినప్పటికీ, పూర్తిస్థాయి గెలుపునకు అంతర్గత కలహాలు అడ్డంకిగా మారుతున్నాయి. అధిష్టానం వెంటనే జోక్యం చేసుకుని నేతల మధ్య ఉన్న విభేదాలను తొలగించాలని, లేనిపక్షంలో రాబోయే ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని పార్టీ శ్రేణులు హెచ్చరిస్తున్నాయి. నాయకుల మధ్య ఐక్యత లేకపోతే అధికారంలో ఉండి కూడా ప్రజల్లోకి పథకాలను తీసుకెళ్లలేకపోతున్నామని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.






