నంచ‌ర్ల‌-జూల‌ప‌ల్లి-కోల్ బాయి తండా ర‌హ‌దారి అభివృద్ధికి నిధులు మంజూరు

by Ratna Kumari |

దిశ‌, మ‌హ‌మ్మ‌దాబాద్ : మహబూబ్‌నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలంలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న నంచర్ల ఎక్స్‌రోడ్–జూలపల్లి–కోల్‌బాయి తాండా రహదారి సమస్యకు చివరికి పరిష్కారం దొరికింది.

నంచ‌ర్ల‌-జూల‌ప‌ల్లి-కోల్ బాయి తండా ర‌హ‌దారి అభివృద్ధికి నిధులు మంజూరు
X

దిశ‌, మ‌హ‌మ్మ‌దాబాద్ : మహబూబ్‌నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలంలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న నంచర్ల ఎక్స్‌రోడ్–జూలపల్లి–కోల్‌బాయి తాండా రహదారి సమస్యకు చివరికి పరిష్కారం దొరికింది. గ్రామాల మధ్య ప్రధాన అనుసంధానంగా ఉండే ఈ రహదారి గుంతలతో నిండిపోవడంతో పల్లె ప్రజలు నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. రోగులను ఆస్పత్రులకు తరలించటం, విద్యార్థులు పాఠశాలలకు చేరుకోవడం, రైతులు పంట ఉత్పత్తులను మార్కెట్‌కు తీసుకెళ్లడం వంటి ప్రతి విషయంలోనూ ప్రజలు తీవ్రంగా బాధ పడుతున్న కష్టాలు అసహనానికి చేరాయి. ఈ రహదారి కోసం ఎన్నో ఏళ్లుగా గ్రామస్థులు ధర్నాలు, రాస్తారోకోలు, విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకపోవడంతో ప్రజల్లో నిరాశ నెలకొన్నది. ఈ నేపథ్యంలో పరిగి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి సమస్యను చక్కగా అర్థం చేసుకుని ప్రభుత్వంతో చేపట్టిన అనుసంధాన ప్రయత్నాల ఫలితంగా 700 లక్షల రూపాయల భారీ నిధులు మంజూరయ్యాయి. త్వరలో పనులు ప్రారంభంకానుండటంతో ప్రాంతీయ ప్రజల్లో కొత్త ఆశలు మేల్కొన్నాయి.


ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేఎం. నారాయణ మాట్లాడుతూ— “జూలపల్లి, కోల్‌బాయి తాండా ప్రజల ఎన్నేళ్ల కల నేడు నెరవేరుతోంది. ఎమ్మెల్యే గారి కృషి వల్ల ఈ రహదారి అభివృద్ధికి ముందడుగు పడింది. ప్రజల తరఫున రామ్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం” అని అన్నారు. గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు కూడా ఈ నిర్ణయాన్ని హర్షం వ్యక్తం చేస్తూ, రహదారి పనులు వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరారు. ఈ రహదారి అభివృద్ధి పూర్తయితే మండలంలోని దూర ప్రాంతాలకూ రవాణా సులభంగా మారి, ఆర్థిక, విద్యా, వైద్య రంగాల్లో గ్రామాల అభివృద్ధికి కొత్త దశ ప్రారంభమవుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Next Story