ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అద్భుతాలు సృష్టిస్తున్నారు

by Ratna Kumari |

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు చదువులో అద్భుతాలు సృష్టిస్తున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అద్భుతాలు సృష్టిస్తున్నారు
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు చదువులో అద్భుతాలు సృష్టిస్తున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల ప్రకటించిన పదో తరగతి ఫలితాల్లో హన్వాడ మండలం కొత్తపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచిన సి.చరణ్ కుమార్ (473), డి. విజయలక్ష్మి (468), డి. రాకేష్ (452), ఎన్. అక్షయ (443), పి. కార్తిక్ (431) లను ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఘనంగా సన్మానించి అభినందించి మాట్లాడారు.

సీఎం రేవంత్ రెడ్డి విద్యా రంగంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, రాబోయే పదేళ్లలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే విద్యలో అగ్రస్థానంలో నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైందని, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత సరైన దృష్టి పెట్టి ఉంటే రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందేదని అన్నారు. పేద విద్యార్థులు చదువుకోవాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని, కార్పొరేట్ స్థాయిని తలదన్నే విధంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం గోపాల్, ఉపాధ్యాయులు సాయినాథ్, శ్రీనాథ్, వెంకటేష్, షాబుద్దీన్, లక్ష్మణ్ పాల్గొన్నారు.

Next Story