ప్రభుత్వ పథకాలకు విస్తృత ప్రచారం కల్పించండి : దేవరకద్ర ఎమ్మెల్యే జీఎంఆర్

by Ratna Kumari |

తప్పుడు ప్రచారాలు లేకుండా ప్రజలకు నిర్భయంగా నిజాలు చెప్పండి. ప్రభుత్వ పథకాలను గురించి మరింతగా వివరించాలి అని అధికారులకు ఎమ్మెల్యే జీఎంఆర్ సూచించారు.

ప్రభుత్వ పథకాలకు  విస్తృత ప్రచారం కల్పించండి :  దేవరకద్ర ఎమ్మెల్యే జీఎంఆర్
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపడుతున్నప్పటికీని అనుకున్న స్థాయిలో ప్రచారం కావడం లేదు. ఈ విషయాన్ని గుర్తించి అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసికట్టుగా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లాలి అని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గురువారం ప్రజా పాలన... ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఉచిత విద్యుత్తు సరఫరా, సన్న బియ్యం పంపిణీ తదితర పథకాలను అమలు చేయడం వల్ల.. ఎన్నో కుటుంబాలకు మేలు జరుగుతుందని చెప్పారు. వరి ధాన్యం ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేస్తున్నాం. కానీ ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆలోచనలు లేకుండా విమర్శలు చేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో జరుగుతున్న కార్యక్రమాల వివరాలను గురించి ప్రజలకు తెలియ చెప్పకుంటే వాళ్లు చెప్పిందే నిజం అని నమ్మే పరిస్థితులు ఉంటాయి. తప్పుడు ప్రచారాలు లేకుండా ప్రజలకు నిర్భయంగా నిజాలు చెప్పండి. ప్రభుత్వ పథకాలను గురించి మరింతగా వివరించాలి అని అధికారులకు ఎమ్మెల్యే జీఎంఆర్ సూచించారు. మహిళా సంఘాల అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని చెప్పారు. విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించాలి అనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలను, కళాశాలలను అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నారు. ప్రైవేటు విద్యాసంస్థలకు వెళ్లకుండా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విధంగా బడిబాట కార్యక్రమం నిర్వహించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.

99 రోజుల కార్యక్రమం విజయవంతం : కలెక్టర్ కుష్బూ గుప్తా

ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం విజయవంతం అయింద‌ని కలెక్టర్ కుష్బూ గుప్తా చెప్పారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా జిల్లాలో కార్యక్రమాలు కొనసాగాయి. అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించుకోగలిగామని.. దీనివల్ల ఎన్నో కుటుంబాలకు మేలు జరుగుతుందని కలెక్టర్ చెప్పారు.

పిల్లలు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్త పడదాం : ఎస్పీ జానకి

చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు మోటార్ వాహనాలు ఇప్పిస్తున్నారు. ఇష్టం వచ్చినట్లుగా డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాల బారిన పడి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ చాలామంది ప్రమాదాల బారిన పడుతున్నారు అని ఎస్పీ జానకి అన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు. గంజాయి ప్రభావం పెరుగుతుంది. ఎక్కడికక్కడ అరికట్టేందుకు అందరూ సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మమత, ముడ చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, భూత్పూర్ మున్సిపల్ చైర్మన్ బాలకోటి వివిధ శాఖల అధికారులు ప్రసంగించారు. అంతకుముందు వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఎమ్మెల్యే జీఎంఆర్, కలెక్టర్ కుష్బూ గుప్తా, ఎస్పీ జానకి పరిశీలించారు.

Next Story