- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, మహబూబ్ నగర్: పాలమూరు జిల్లాలో విషతుల్యమైన గంజాయి కోరలు చాచుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లా కేంద్రం అడ్డాగా నగర గల్లీల నుంచి మారుమూల పల్లెల వరకు ఈ నిషా దందా యథేచ్ఛగా సాగుతోంది. విచ్చలవిడిగా దొరుకుతున్న గంజాయికి బానిసలై వేలాది మంది యువకులు తమ బంగారు భవిష్యత్తును బుగ్గిపాలు చేసుకుంటున్నారు. ఈ దందా వెనుక బడా బాబుల హస్తం ఉన్నా, సంబంధిత అబ్కారి (ఎక్సైజ్) శాఖాధికారులు మాత్రం మొద్దునిద్ర పోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గ్రామాలకు పాకిన ‘నిషా’.. విలవిల్లాడుతున్న కుటుంబాలు..
ఒకప్పుడు కేవలం పట్టణాలకే పరిమితమైన గంజాయి మహమ్మారి ఇప్పుడు గ్రామాలకు సైతం విస్తరించింది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కొన్ని కీలక ప్రాంతాల నుంచి ఏజెంట్ల ద్వారా ఈ రవాణా నెట్‌వర్క్ నడుస్తోంది. ముఠా సభ్యులు ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు, పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసే కార్మికులను లక్ష్యంగా చేసుకుని గంజాయిని విక్రయిస్తున్నారు. దీనివల్ల జిల్లాలో నేరాలు పెరగడమే కాకుండా, ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయి. ఇంట్లో పిల్లల ప్రవర్తన చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు.
అసలు ‘తిమింగలాలు’ సేఫ్.. అధికారుల తీరుపై ఆగ్రహం!..
గంజాయిని అరికట్టాల్సిన ఎక్సైజ్ శాఖాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అడపా దడపా పోలీసులు దాడులు చేస్తున్నా.. అవి కేవలం చిన్న చిన్న విక్రేతలకే పరిమితమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో కొరియర్లను పట్టుకుని కేసులు నమోదు చేస్తున్న అధికారులు, అసలు సూత్రధారుల జోలికి వెళ్లడం లేదన్న వాదన వినిపిస్తోంది. గంజాయి అమ్ముతున్న వారి వివరాలు, అడ్డా కేంద్రాలు తెలిసినా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బాధితులు ప్రశ్నిస్తున్నారు.
సమన్వయ లోపం.. అక్రమార్కులకు అండ!..
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోనూ, మండల కేంద్రాల్లోనూ గంజాయి నెట్‌వర్క్ ఇంత వేగంగా విస్తరించడానికి పోలీసు, ఆబ్కారీ శాఖల మధ్య సమన్వయ లోపమే ప్రధాన కారణమని తెలుస్తోంది. అధికారుల అలసత్వం చూస్తుంటే, అక్రమార్కులకు అధికారుల అండదండలు ఏమైనా ఉన్నాయా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి, మూలాలపై దృష్టి సారించి ఈ మహమ్మారిని అంతం చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.






