"జడ్పీ పీఠాలపై మాజీ ఎమ్మెల్యేల చూపు"

by Malleboina Mahesh |

పాలమూరు జిల్లా రాజకీయాలు స్థానిక సంస్థల ఎన్నికలతో మరోసారి వేడెక్కాయి.

జడ్పీ పీఠాలపై మాజీ ఎమ్మెల్యేల చూపు
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: పాలమూరు జిల్లా రాజకీయాలు స్థానిక సంస్థల ఎన్నికలతో మరోసారి వేడెక్కాయి. రిజర్వేషన్లు మహిళలకు దక్కడంతో, జడ్పీ చైర్మన్ పీఠాలను తమ సతీమణుల ద్వారా కైవసం చేసుకునేందుకు పలువురు మాజీ ఎమ్మెల్యేలు తెర వెనుక ప్రయత్నాలు మొదలుపెట్టారు. పీఠం దక్కితే రాజకీయ పట్టు నిలబడుతుందనే లక్ష్యంతో.. ఏకంగా పార్టీలు మారడానికైనా సిద్ధమంటూ సంకేతాలు పంపిస్తున్నారు. మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి తన సతీమణిని రంగంలోకి దించేందుకు సిద్ధమవుతుండగా, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ మాత్రం.. బీసీ మహిళ రిజర్వ్ స్థానం కోసం బి.ఆర్.ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి జంప్ కావడానికి సిద్ధమవుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు తీర్పు వెలువడక ముందు, అధికార పీఠాల చుట్టూ మాజీ నేతలు అల్లిన కుటుంబ రాజకీయ వ్యూహాలు ఉమ్మడి జిల్లాలో హాట్ టాపిక్‌గా మారాయి.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రకంపనలు మొదలయ్యాయి. జిల్లా పరిషత్ చైర్మన్ (జడ్పీ) పీఠాలను తమ సతీమణులు, లేదా కుటుంబ సభ్యులకు దక్కించుకునేందుకు పలువురు మాజీ ఎమ్మెల్యేలు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. జడ్పీ పీఠం దక్కితే రాజకీయంగా పట్టు లభిస్తుందని భావిస్తున్న మాజీ నేతలు, ఆయా ప్రధాన పార్టీల అధినేతల నుండి స్పష్టమైన హామీల కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

రిజర్వేషన్లు అనుకూలం..

జిల్లాలోని ఐదు జడ్పీ చైర్మన్ స్థానాలలో మూడు (మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి) బీసీ మహిళలకు రిజర్వ్ అయ్యాయి. నారాయణపేట జనరల్ మహిళకు, జోగులాంబ గద్వాల మాత్రం ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ అయిన నేపథ్యంలో, రిజర్వేషన్లు ఉన్నచోట తమ కుటుంబ సభ్యులను జడ్పీటీసీలుగా గెలిపించి, జడ్పీ పీఠాలను చేజిక్కించుకోవడానికి మాజీ ఎమ్మెల్యేలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

నారాయణపేట పీఠంపై చిట్టెం కన్ను..

నారాయణపేట జిల్లా జడ్పీ చైర్మన్ పీఠం (జనరల్ మహిళ) దక్కించుకునేందుకు మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి తన సతీమణిని రంగంలోకి దింపేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మక్తల్ లేదా ధన్వాడ జడ్పీటీసీ స్థానాల నుంచి ఆమెను పోటీ చేయించే యోచనలో చిట్టెం ఉన్నట్లు సమాచారం. మరోవైపు, ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ అయిన జోగులాంబ గద్వాల జడ్పీ పీఠం కోసం మాజీ ఎంపీ, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తన కుమారుడిని బరిలోకి దించుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

పీఠం కోసం పార్టీ మార్పు!

జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ కూడా తన సతీమణికి జడ్పీ చైర్మన్ పదవిని దక్కించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ప్రస్తుతము బి.ఆర్.ఎస్‌లో ఉన్న ఆయన, మహబూబ్ నగర్ లేదా నారాయణపేట జిల్లాలలోని ఏదైనా ఒక బీసీ మహిళా రిజర్వ్ స్థానాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో హన్వాడ, మిడ్జిల్‌ జడ్పీటీసీ స్థానాలు బీసీ మహిళకు రిజర్వ్ అయినందున, ఈ రెండింటిలో ఒక స్థానం నుంచి తన సతీమణిని పోటీకి దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

అవసరమైతే కాంగ్రెస్‌లోకి..

జడ్పీ పీఠంపై హామీ దక్కితే ఆయన బి.ఆర్.ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడానికి సిద్ధమవుతున్నట్లు ఉమ్మడి పాలమూరు జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారంతో స్థానిక రాజకీయ వర్గాలలో రసవత్తర చర్చలు మొదలయ్యాయి. ఎర్ర శేఖర్ అధికార పార్టీలోకి వస్తే పార్టీ అభ్యర్థులకు లాభమని కొందరు అంటుంటే, మరికొంతమంది ముఖ్య నాయకులు వ్యతిరేకించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది.

కోర్టు తీర్పు తర్వాతే తుది నిర్ణయాలు..

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాతే జిల్లా పరిషత్ చైర్మన్ పదవుల విషయంలో మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులు తుది నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున, వారిని దీటుగా ఎదుర్కోవాలంటే, మాజీ ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులను పోటీలో ఉండడం ప్రయోజనకరం అని ఆయా పార్టీల ముఖ్య నాయకులు భావిస్తున్నారు.

మాజీ ఎమ్మెల్యేల స్పందన..

"కోర్టు తీర్పు వచ్చి, ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత పార్టీ పరిస్థితులు, అధిష్టానం నిర్ణయం అనుకూలంగా ఉంటే, మా కుటుంబ సభ్యులను ఎన్నికల్లో పోటీ చేయించే విషయంలో తప్పకుండా నిర్ణయం తీసుకుంటాం" అని పలువురు మాజీ ఎమ్మెల్యేలు 'దిశ'కు తెలిపారు.

Next Story