ఈఎంఐ కట్టలేదని ఇంటి పై ఫైనాన్స్ సిబ్బంది దాడి..!

by Ratna Kumari |

జోగులాంబ‌ గద్వాల జిల్లాలో ఫైనాన్స్ రికవరీ ఏజెంట్ల అరాచకాలు మరోసారి తీవ్ర చర్చకు దారి తీశాయి.

ఈఎంఐ కట్టలేదని ఇంటి పై ఫైనాన్స్ సిబ్బంది దాడి..!
X

దిశ, గద్వాల క్రైం/ఇటిక్యాల : జోగులాంబ‌ గద్వాల జిల్లాలో ఫైనాన్స్ రికవరీ ఏజెంట్ల అరాచకాలు మరోసారి తీవ్ర చర్చకు దారి తీశాయి. నెలవారీ వాయిదా బాకీలు (EMI) సకాలంలో చెల్లించలేదనే నెపంతో ఓ ఫైనాన్స్ కంపెనీ సిబ్బంది అతిగా ప్రవర్తించి, కస్టమర్ ఇంటిపై దాడికి పాల్పడారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు సదరు కస్టమరే తమ పై తిరగబడి దాడికి తెగబడ్డాడని ఫైనాన్స్ సిబ్బంది ప్రతి ఆరోపణలు చేస్తున్నారు. ఇరువర్గాల ఘర్షణతో ఇటిక్యాల పోలీస్ స్టేషన్‌లో పరస్పర కేసులు నమోదయ్యాయి.

బాకీ పడ్డ మూడు ఈఎంఐలు.. ఇంటి వద్ద ఘర్షణ

ఇటిక్యాల మండలం ఉదండాపురం గ్రామానికి చెందిన కళ్యాణ్ కుమార్ తన ఇంటి నిర్మాణం కొరకు గద్వాలలోని చోళా ఫైనాన్స్ కంపెనీలో రూ. 5 లక్షల వరకు రుణం తీసుకున్నాడు. ప్రతి నెల రూ. 12,800 చొప్పున మొత్తం 72 నెలల పాటు ఈఎంఐ రూపంలో చెల్లించాల్సి ఉంది. ఇప్పటి వరకు పది వాయిదాలు సక్రమంగానే చెల్లించిన కళ్యాణ్ కుమార్, గత మూడు నెలలుగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఈఎంఐ చెల్లించలేకపోయాడు. ఈ క్రమంలో నెలవారీ వాయిదాల వసూలు కోసం ఈనెల 17న ఫైనాన్స్ సిబ్బంది ఉదండపురంలోని కళ్యాణ్ నివాసానికి చేరుకున్నారు. ఆ సమయంలో కళ్యాణ్ ఇంట్లో లేకపోవడంతో ఆయన భార్య మహేశ్వరితో సిబ్బంది వాగ్వాదానికి దిగారు. ఇంతలోనే అక్కడికి చేరుకున్న కళ్యాణ్‌తో మాట మాట పెరిగి ఘర్షణకు దారితీసింది. ఫైనాన్స్ సిబ్బంది తమ పట్ల దురుసుగా ప్రవర్తించడమే కాకుండా, కళ్యాణ్, మహేశ్వరి దంపతులపై భౌతిక దాడికి పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తూ ఇటిక్యాల పోలీసులను ఆశ్రయించారు.

ఖండించిన ఫైనాన్స్ సిబ్బంది

బాధితుల ఆరోపణలను ఫైనాన్స్ సిబ్బంది తీవ్రంగా ఖండించారు. తాము ఎలాంటి దాడికి పాల్పడలేదని, లోన్ రికవరీ విషయమై మాట్లాడటానికి వెళ్లిన తమపై కస్టమరే భౌతిక దాడికి తెగబడ్డాడని ఆరోపిస్తూ వారు కూడా పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

పోలీసుల రాజీ ప్రయత్నాలపై ఆరోపణలు.. కేసు నమోదు

ఈ ఘటనపై ఇరువర్గాలు ఇటిక్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నప్పటికీ, పోలీసులు వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని బాధితుడు కళ్యాణ్ కుమార్ ఆరోపించారు. ఎర్రవల్లి చౌరస్తాకు చెందిన ఒక వ్యక్తి ద్వారా కేసును రాజీ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి.

రెండు రోజుల్లో ఛార్జ్‌షీట్ : ఎస్ఐ రవి

ఈ ఉదంతంపై ఇటిక్యాల ఎస్ఐ రవిని దిశ వివరణ కోరగా.. ఫైనాన్స్ కంపెనీలో లోన్ తీసుకున్న కళ్యాణ్, ఫైనాన్స్ సిబ్బంది ఇరువురు పరస్పరం ఫిర్యాదు చేసుకున్న మాట వాస్తవమేనన్నారు. ఈ ఘటనపై కోర్టు ద్వారా అనుమతి తీసుకుని ఇరువర్గాలపై కేసులు నమోదు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. కేసు దర్యాప్తు వేగవంతంగా సాగుతోందని, మరో రెండు రోజుల్లోనే ఈ వివాదానికి సంబంధించిన ఛార్జ్‌షీట్‌ను కోర్టులో దాఖలు చేయనున్నట్టు ఎస్ఐ రవి వెల్లడించారు.

Next Story