రెండు నదులు ఉప్పొంగుతున్నా నీళ్లకు కరువొచ్చె..

by Elthuri vijay kumar |

నడిగడ్డలో రెండు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నా, మానోపాడు మండల కేంద్రంలో మాత్రం తాగునీటి కోసం ప్రజలు తంటాలు పడుతున్నారు. ఐదు రోజులుగా మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా ఆగిపోవడంతో పాటు, స్థానిక మోటార్ల ద్వారా కూడా నీరు అందక ఇళ్లల్లో బిందెలు ఎండిపోయాయి.

రెండు నదులు ఉప్పొంగుతున్నా నీళ్లకు కరువొచ్చె..
X

రెండు నదులు ఉప్పొంగుతున్నా నీళ్లకు కరువొచ్చె..

- మానోపాడు మండల కేంద్రంలో తాగునీటి కటకట

- ఐదురోజులుగా మిషన్ భగీరథ వాటర్ బంద్

- వర్షాకాలంలోనే ఇలా ఉంటే వేసవిలో ఎలా? అంటూ ప్రజల ఆందోళన

దిశ, మానోపాడు: నడిగడ్డలో రెండు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నా, మానోపాడు మండల కేంద్రంలో మాత్రం తాగునీటి కోసం ప్రజలు తంటాలు పడుతున్నారు. ఐదు రోజులుగా మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా ఆగిపోవడంతో పాటు, స్థానిక మోటార్ల ద్వారా కూడా నీరు అందక ఇళ్లల్లో బిందెలు ఎండిపోయాయి. బుధవారం ఉదయం మండల పరిషత్ కార్యాలయానికి చేరుకున్న ప్రజలు ఎంపీడీవో రాఘవ, మిషన్ భగీరథ ఏఈ తేజలకు తమ సమస్యలు చెప్పుకున్నారు. “వర్షాకాలంలోనే ఇలా ఉంటే వేసవిలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే భయమేస్తోంది. కాలకృత్యాలకైనా నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నాం. దాహం తీర్చుకోవడానికి నీళ్లు కొనుక్కోవాల్సి వస్తోంది” అని వాపోయారు. దసరా సెలవుల కారణంగా బంధువులు, విద్యార్థులు గ్రామానికి రావడంతో సమస్య మరింతగా పెరిగిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో అధికారులు స్పందించి, మిషన్ భగీరథ మోటార్లు సక్రమంగా పనిచేయకపోవడం వల్ల సమస్య తలెత్తిందని తెలిపారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, తక్షణమే నీటి సరఫరా పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ప్రజలు శాంతించారు.

Next Story