విద్యుత్ వైర్లు తగిలి గడ్డివాము దగ్ధం.. తప్పిన ప్రాణాపాయం

by Nallavelli.Anjaneyulu |

ధరూర్ మండలం జాంపల్లి గ్రామ శివారులో ఆదివారం మధ్యాహ్నం భారీ ప్రమాదం చోటు చేసుకుంది.

విద్యుత్ వైర్లు తగిలి గడ్డివాము దగ్ధం.. తప్పిన ప్రాణాపాయం
X

దిశ, గద్వాల క్రైమ్/ధరూర్ : ధరూర్ మండలం జాంపల్లి గ్రామ శివారులో ఆదివారం మధ్యాహ్నం భారీ ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ వైర్లు తగిలి ట్రాక్టర్‌పై తరలిస్తున్న గడ్డివాము పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. గద్వాల మండలం కొండపల్లి గ్రామానికి అచ్చమొళ్ల విష్ణు కు చెందిన రైతులు తమ పశువుల మేత కోసం జాంపల్లి గ్రామంలో గడ్డిని కొనుగోలు చేశారు. దానిని ట్రాక్టర్‌పై లోడ్ చేసుకుని కొండపల్లికి తరలిస్తుండగా.. జాంపల్లి శివారులోని ర్యాలంపాడు కాలువ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అక్కడ విద్యుత్ లైన్లు కిందికి వేలాడుతుండటంతో, ట్రాక్టర్‌పై ఉన్న గడ్డికి వైర్లు తగిలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

అప్రమత్తమైన డ్రైవర్, రైతులు

మంటలు వ్యాప్తి చెందడాన్ని గమనించిన డ్రైవర్, పాడి రైతులు వెంటనే ట్రాక్టర్ నుంచి కిందకు దూకడంతో ప్రాణాపాయం తప్పింది. చూస్తుండగానే మంటలు ఎగిసిపడి గడ్డి పూర్తిగా కాలి బూడిదైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజిన్ సాయంతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా ఆ రోడ్డులో సుమారు అరగంటకు పైగా రాకపోకలు నిలిచిపోయాయి. అగ్నిప్రమాదంతో తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని, బాధిత పాడి రైతులకు ఆర్థిక సాయం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Next Story