కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యకు పెద్దపీట: ఎమ్మెల్యే

by Naveena |

గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిందని, దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యకు పెద్దపీట: ఎమ్మెల్యే
X

దిశ,దేవరకద్ర: గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిందని, దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. బుధవారం కౌకుంట్ల మండలం అప్పంపల్లి పాఠశాల, దేవరకద్ర మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో జిఎంఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో.. విద్యార్థులకు స్టడీ మెటీరియల్, సైకిల్ లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ..గత ప్రభుత్వ హాయంలో పాఠశాలలో మౌలిక వ్యవస్థలను పట్టించుకోలేదని, పదేళ్ల పాలనలో టీచర్ల నియామకాలను చేపట్టలేదన్నారు. విద్యాశాఖకు నిధులు కేటాయించలేదని బిఆర్ఎస్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ చరిత్రలో ఎన్నడు లేని విధంగా విద్యాశాఖకు అధిక నిధులు కేటాయించడంతో పాటు..11,062 టీచర్ పోస్టులు భర్తీ చేశామన్నారు. 15 ఏళ్ల తర్వాత సుమారు 19000 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించామని, అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో పాఠశాలలో మౌలిక వసతులు కల్పించామని తెలిపారు. దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో గత పాలకులు పదేళ్లు అధికారంలో ఉండి కనీసం డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయలేకపోయారన్నారు. తాము అధికారంలోకి రాగానే డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేశామని, అలాగే చిన్న చింతకుంట మండల కేంద్రంలో జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేశామని తెలిపారు. పదవ తరగతి విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఏకాగ్రతతో చదువుకోవాలని పదవ తరగతిలో మంచి మార్కులు సాధించి తల్లిదండ్రులకు పాఠశాలకు, మీ గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే జిఎంఆర్ సూచించారు.

మన పాలమూరు ముద్దుబిడ్డ సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకొని ఈ స్థాయికి వచ్చారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణ శాతాన్ని పెంచేందుకు విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా పాఠ్యపుస్తకాల నుండి క్యూఆర్ కోడ్ ద్వారా డిజిటల్ క్లాసులకు అనుసంధానం అయ్యేలా నిపుణులైన అధ్యాపకులతో తన సొంత నిధులతో స్టడీ మెటీరియల్ తయారు చేయించడం జరిగిందని తెలిపారు. ఈ స్టడీ మెటీరియల్ను మండల విద్యార్థులతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థులకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ అరవింద్ కుమార్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ కతలప్ప, దేవరకద్ర మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అంజిల్ రెడ్డి, కోన రాజశేఖర్, కిరణ్ రెడ్డి, తహసిల్దార్ కృష్ణయ్య ,మండల విద్యాధికారి బలరాం, ఈవో సీత్యానాయక్, మండల కాంగ్రెస్ నాయకులు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Next Story