డ్వాక్రా మ‌హిళ‌ల నిధుల దుర్వినియోగంపై ఆగ్రహం

by Ratna Kumari |   (  Updated:2026-05-11 14:54:47  IST  )

మండ‌లంలోని డ్వాక్రా సంఘాల నిధుల్లో భారీ స్థాయిలో అవినీతి జ‌రిగింద‌ని ఆరోపిస్తూ సీపీఎం జిల్లా నాయ‌కులు కలెక్ట‌ర్ ఖుష్బూ గుప్తా కి విన‌తిప‌త్రం అంద‌జేశారు.

డ్వాక్రా మ‌హిళ‌ల  నిధుల దుర్వినియోగంపై ఆగ్రహం
X
దిశ‌, మ‌హ‌మ్మ‌దాబాద్ : మండ‌లంలోని డ్వాక్రా సంఘాల నిధుల్లో భారీ స్థాయిలో అవినీతి జ‌రిగింద‌ని ఆరోపిస్తూ సీపీఎం జిల్లా నాయ‌కులు కలెక్ట‌ర్ ఖుష్బూ గుప్తా కి విన‌తిప‌త్రం అంద‌జేశారు. గ్రామ సంఘాలకు చెందిన వడ్ల కమీషన్, శ్రీనిధి, ఐహెచ్‌ఎల్ నిధుల్లో సుమారు రూ.95 లక్షల వరకు అక్రమాలు జరిగినట్లు పేర్కొంటూ.. పూర్తి స్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మండలంలోని సుమారు 600 డ్వాక్రా సంఘాల్లో 6 వేల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారని, ఈ సంఘాలకు సంబంధించిన నిధులను కొంతమంది వీఓఏలు దుర్వినియోగం చేశారని ఆరోపించారు.

ముఖ్యంగా వడ్ల కొనుగోలు కమీషన్‌లో గ్రామ సంఘాల అభివృద్ధికి వినియోగించాల్సిన నిధులను వ్యక్తిగత ప్రయోజనాలకు మళ్లించారని తెలిపారు. డ్వాక్రా సంఘాల పై పర్యవేక్షణ లేకపోవడంతో అనేక సంఘాలు నిర్వీర్యమవుతున్నాయని, మహిళల్లో ప్రభుత్వ వ్యవస్థపై విశ్వాసం తగ్గిపోతుందని సీపీఎం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని గ్రామ సంఘాల ఖాతాలను ఆడిట్ చేసి, అక్రమాలకు పాల్పడిన వారి నుంచి నిధులను రికవరీ చేసి తిరిగి సంఘాల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ. రాములు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్. కురుమూర్తి, కిల్లె గోపాల్, ఎం. రాములు, జిల్లా కమిటీ సభ్యులు జి. నర్సింహులు, ఎ. లక్ష్మయ్య, బి. చంద్రకాంత్, పి. జగన్, బి. రాజ్‌కుమార్, బి. రాజు పాల్గొన్నారు.

Next Story