తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ప్రారంభంపై నీలినీడలు

by Malleboina Mahesh |

తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే నిధుల విడుదల, మౌలిక వసతుల కల్పనలో జాప్యం కారణంగా ఈ లక్ష్యం నెరవేరుతుందా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ప్రారంభంపై నీలినీడలు
X

దిశ, మహబూబ్‌నగర్ బ్యూరో: కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ విద్యను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’ ఏర్పాటుపై విద్యాశాఖలో వేగంగా కసరత్తు సాగుతోంది. వచ్చే విద్యా సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పాఠశాలలను ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుండగా.. మౌలిక వసతులు, సిబ్బంది, రవాణా వంటి కీలక అంశాలు ఇంకా ప్రారంభ దశలోనే ఉండటంతో ఈ లక్ష్యం సాధ్యాసాధ్యాలపై విద్యావేత్తలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక పాఠశాలను తెలంగాణ పబ్లిక్ స్కూల్ గా ఎంపిక చేసి. ఆ పాఠశాలలో నర్సరీ నుండి ఇంటర్మీడియట్ వరకు దాదాపుగా 2500 మంది విద్యార్థులు చదువుకునే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయం పాఠకులకు విదితమే.

విద్యార్థులకు వాహన సదుపాయాలు కల్పించడం, ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ ఏర్పాటు చేసి విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందించే లక్ష్యంతో ఈ పాఠశాలలను రానున్న విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం ఆగమేఘాల పై చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాలోని విద్యాశాఖ అధికారులు, సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సమావేశాలు ఏర్పాటు చేసి పాఠశాలల ఏర్పాటు అంశంపై పూర్తి వివరాలు అందజేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

ఎదురుకానున్న సవాళ్లు..

తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు అనేక సవాళ్లు ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఎంపిక చేసిన పాఠశాలలు కేవలం ఆ చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులకు సరిపడా తరగతులు, మౌలిక సదుపాయాలు, క్రీడా మైదానం తదితరాలు మాత్రమే ఉన్నాయి. ఈ పాఠశాలల్లో సగటున 100 నుంచి 500 లోపు విద్యార్థులు మాత్రమే చదువుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాంటిది ఆ పాఠశాలలో ఇప్పుడు ఉన్న తరగతులకు అదనంగా ప్రాథమిక, ఇంటర్మీడియట్ తరగతులను చేర్చడంతో విద్యార్థుల సంఖ్య పెద్ద మొత్తంలో పెరిగే అవకాశాలు ఉంటాయి. దీనికి తోడు ఆ పాఠశాల ఉన్న మండలాలలో, ఇతర చుట్టుపక్కల గ్రామాల నుంచి వాహనాలు ఏర్పాటు చేస్తే పలు పాఠశాలలు మూత పడే పరిస్థితులు నెలకొంటాయి. వీటితోపాటు తెలంగాణ పబ్లిక్ స్కూల్ లక్ష్యాలకు అనుగుణంగా పలు పాఠశాలల్లో తరగతి గదులు, మౌలిక సదుపాయాలు ఏమాత్రం లేవు. సిబ్బంది కొరత, మౌలిక సదుపాయాల లేమి ఇబ్బందికరంగా మారే పరిస్థితిలో ఉన్నాయి.

విడుదల కానీ నిధులు..

తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పాఠశాలకు 15 కోట్ల రూపాయలు మంజూరు చేయడానికి నిర్ణయించింది. విద్యా సంవత్సరం ప్రారంభం కావడానికి మరో నెల రోజులు మాత్రమే గడుగు ఉంది. ఈనెల రోజులలో కొత్త గదుల నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కల్పన సాధ్యం కాదు అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పూర్తిస్థాయి సదుపాయాలు కల్పించాలి.. అదనపు గదుల నిర్మాణాలు... సిబ్బంది కేటాయింపులు పూర్తిస్థాయిలో జరగాలి అంటే కనీసం సంవత్సరం సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో రానున్న విద్యా సంవత్సరంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ప్రారంభం కావడం ప్రశ్నార్థకమే నాని పలువురు అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ప్రభుత్వానికి చేరిన వినతులు

ఉమ్మడి పాలమూరు జిల్లా సహా రాష్ట్ర వ్యాప్తంగా డీఈవోలు, క్షేత్రస్థాయి అధికారులు ఈ సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. కేవలం భవనాలు ఉన్నంత మాత్రాన స్కూళ్లు నడవవని, సిబ్బంది కేటాయింపు, మౌలిక సదుపాయాల కల్పన పూర్తిస్థాయిలో జరగకుండా పాఠశాలలు ప్రారంభిస్తే విద్యార్థుల భవిష్యత్తు అస్తవ్యస్తమవుతుందని స్పష్టం చేస్తున్నారు. అట్టహాసంగా ప్రారంభించాలనే ఆత్రుత కన్నా, పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తేనే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఆశయం నెరవేరుతుందని విద్యా రంగ నిపుణులు సూచిస్తున్నారు.

Next Story