వితంతువుతో ఇందిర‌మ్మ ఇంటికి భూమి పూజ చేయించ‌వ‌ద్దు.. స‌ర్ది చెప్పి మంత్రి జూప‌ల్లి

by Ratna Kumari |

దిశ, కొల్లాపూర్ : కొల్లాపూర్ మండలం మాచినేని పల్లిలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిర‌మ్మ ఇల్లు భూమిపూజ చేసేందుకు మంత్రి జూపల్లి కృష్ణా రావు ఆదివారం గ్రామంలో పర్యటించారు.

వితంతువుతో ఇందిర‌మ్మ ఇంటికి భూమి పూజ చేయించ‌వ‌ద్దు.. స‌ర్ది చెప్పి మంత్రి జూప‌ల్లి
X

దిశ, కొల్లాపూర్ : కొల్లాపూర్ మండలం మాచినేని పల్లిలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిర‌మ్మ ఇల్లు భూమిపూజ చేసేందుకు మంత్రి జూపల్లి కృష్ణా రావు ఆదివారం గ్రామంలో పర్యటించారు. భర్తను కోల్పోయిన లక్ష్మిదేవమ్మ కుమారుడు రాముడి పేరుతో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారు. అయితే ఆయన భార్య గర్భిణి కావడంతో పూజ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. అయితే లక్ష్మిదేవమ్మను భూమిపూజ చేయాలని మంత్రి జూపల్లి కోరారు. అక్కడ ఉన్న స్థానికులు ఆమె వితంతువు అని అభ్యంతరం వ్యక్తం చేస్తూ మంత్రికి చెప్పారు. దీంతో మంత్రి కలుగచేసుకుని ఇలాంటి సాంఘీక దురాచారాలను కొనసాగించడం మంచిది కాదని హితవు పలికారు. అనంతరం లక్ష్మిదేవమ్మతో భూమిపూజ చేయించి, ప్రజల్లో చైతన్య స్ఫూర్తిని నింపారు.


ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. వితంతువులను శుభ కార్యక్రమాల్లో దూరం పెట్టడం సాంఘీక దురాచారమని అన్నారు. భర్తను కోల్పోయి మానసిక వేదనకు గురవుతున్న స్త్రీలను శుభకార్యాలకు దూరంగా పెట్టడం, నోములు వ్రతాలకు బహిష్కరించడం అమానవీయమన్నారు. వితంతువు పై వివక్ష అనేది ఒక తీవ్రమైన సమస్య. వితంతువులను అపశకునంగా భావించడం, నిందించడం మానుకోవాలి. ఇంకా వాటిని కొనసాగించడం మహిళల పట్ల వివక్షత చూపడమేనన్నారు. ఈ దురాచారాలే స్త్రీల ఆర్ధిక, మానసిక పెరుగుదలకు అడ్డంకిగా మారాయని ఆయన విచారం వ్యక్తం చేశారు. పురోగమిస్తున్న సమాజంలో ఇలాంటి వివక్ష సరికాదు. ఈ సాంఘీక దురాచారం మన సంస్కృతికి మచ్చ . ఇలాంటి కళంకాలను ఎంత త్వరగా తొలగిస్తే అంత మంచిదని సామాజిక రుగ్మతలపై మంత్రి అక్కడున్న వారికి అవగాహన కల్పించారు. సమాజాన్ని చైతన్య పర్చడానికి మనమంతా నడుం బిగించాలి. వితంతువులను పూజ, ఇత్యాది శుభ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడం మనం సమర్ధించాలని మంత్రి జూపల్లి ప్రజల కు పిలుపునిచ్చారు. అమానవీయ ఆచారాలను రూపుమాపాలి. భర్తను కోల్పోయిన స్త్రీకి సమాజం నుంచి కనీస మద్దతు లభించకపోగా అనుమానాలు అవాంతరాలు ఎదురవుతున్నాయి. వితంతు సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని ఆయన ప్రజలకు సూచించారు.


వితంతువులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని అవగాహన కల్పిస్తూ వారికి అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వితంతు రక్షణ, భద్రత కోసం అనేక చట్టాలు రూపొందించిన సామాజిక రుగ్మతల కారణంగా చాలా సందర్భాల్లో అవి నిస్తేజమవుతున్నాయని మంత్రి జూపల్లి విచారం వ్యక్తం చేశారు. చట్టాల రూప కల్పన ప్రత్యేక పథకాల అమలుతో పాటు వివక్ష, సాంఘిక దురాచారాలు, మూడ నమ్మకాల వంటివి దూరం చేసేందుకు అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే వితంతువుల్లో ఆత్మ విశ్వాసం పెరుగుతుందని దిశా నిర్దేశం చేశారు. అలాగే వారి కుటుంబం ఆర్థికంగా బలహీన పరిస్థితిలో ఉండడం వల్ల, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం బేస్మెంట్ నిర్మాణానికి ముందుగా స్వంతంగా నిధులు సమకూర్చుకునే స్థోమత లేకపోవడంతో, మహిళా సంఘాల ద్వారా రూ, లక్షా రుణం మంజూరు చేయాలని సెర్ప్ అధికారులను మంత్రి జూపల్లి ఆదేశించారు.అనంతరం మండల పరిధిలోని మొలచింత పల్లి లో వరి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు ఇమ్మిడి శెట్టి వెంకటస్వామి, మేకల నాగరాజు,కొమ్మ వెంకటస్వామి యాదవ్, కొమ్మ రాజు యాదవ్,హైమావతి బాలస్వామి గౌడ్,మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మాచుపల్లి బాలస్వామి, కాంగ్రెస్ నాయకులు వంగ రాజ శేఖర్ గౌడ్,గొల్ల శ్రీనివాస్, సూర్య శేఖర్, నర్సింహ, చిన్న బాలస్వామి గౌడ్ పాల్గొన్నారు.

Next Story