- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎక్సైజ్ శాఖలో పంపకాల పంచాయితీ
మహబూబ్‌నగర్ ఎక్సైజ్ కార్యాలయంలో నూతన వైన్స్ షాప్ టెండర్ల ప్రక్రియ పూర్తయినప్పటి నుంచి అధికారుల మధ్య ‘పంపకాల

దిశ, మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ ఎక్సైజ్ కార్యాలయంలో నూతన వైన్స్ షాప్ టెండర్ల ప్రక్రియ పూర్తయినప్పటి నుంచి అధికారుల మధ్య ‘పంపకాల పంచాయితీ’ రచ్చకెక్కుతోంది. మహబూబ్‌నగర్ అర్బన్, రూరల్ పరిధిలోని వైన్ షాప్ లైసెన్స్‌ల ప్రక్రియ, నిబంధనల మినహాయింపులకు సంబంధించి ఎక్సైజ్ అధికారులు వైన్ షాప్ యాజమాన్యాల వద్ద భారీగానే డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.
అధికారుల మధ్య వివాదం...
మహబూబ్‌నగర్ అర్బన్ పరిధిలో వైన్ షాపుల సంఖ్య ఎక్కువగా ఉండి, రూరల్ పరిధిలో తక్కువగా ఉండడంతో అర్బన్ అధికారి వద్ద రూరల్ సిబ్బంది సైతం వాటా అడిగినట్లు సమాచారం. ఈ క్రమంలో అర్బన్ అధికారి వాటా ఇచ్చే పరిస్థితి లేదని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో కార్యాలయ సిబ్బంది రెండు వర్గాలుగా చేరి ఎడమొఖం, పెడమొఖంగా విధులు నిర్వర్తిస్తున్నారు. మూడు రోజులుగా కార్యాలయంలోనే సిబ్బంది మధ్య మాటల యుద్ధం సాగుతున్నా, ఉన్నతాధికారి ముందే పంచాయితీ సాగుతున్నా చర్యలు శూన్యమని ఆరోపణలు వినిపిస్తు్న్నాయి.
రాజకీయ జోక్యం, ఉన్నతాధికారుల నిర్లక్ష్యం..
ఈ పంచాయితీ అంతా కూడా ఓ అధికారి ముందే సాగుతున్నా, పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ కారణంగా సార్ ఇరువురిని ఏమి అనలేని పరిస్థితి అని కిందిస్థాయి సిబ్బంది వాపోతున్నారు. పంపకాల పంచాయితీ అంతా కూడా జిల్లా ఆబ్కారీ ఉన్నతాధికారులకు తెలిసినా కనీసం విచారణకు కూడా ఆదేశించకుండా చూసీచూడనట్లు వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. వైన్ షాపుల నుంచి వచ్చే అక్రమ ఆదాయం మీదే దృష్టి పెట్టి, అర్బన్, రూరల్ ప్రాంతంలో కొంతకాలంగా ఇద్దరు సిబ్బంది సైతం గంజాయి కేసులు గాలికి వదిలేసినట్లు తెలుస్తోంది.
మంత్రి దృష్టి సారించాలని డిమాండ్...
మహబూబ్‌నగర్ ఆబ్కారీ కార్యాలయంలో అక్రమ వసూళ్ల వ్యవహారం రచ్చకెక్కడం ప్రభుత్వ ఉద్యోగ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అవినీతే పరమావధిగా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది తీరుతో తాము షాపులు నడపలేమని మద్యం షాపుల యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. కిందిస్థాయి సిబ్బంది సైతం విధులు నిర్వహించడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఇరువురిపై ఆబ్కారీ మంత్రి గారే దృష్టి సారించి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
పూర్తి స్థాయి ప్రక్షాళన అవసరం...
కొందరు అక్రమ సంపాదన మార్గాలను అధికారులకు నూరి పోస్తూ తామే వసూళ్లు చేస్తున్నారని, కల్లు దుకాణాల వద్ద, బెల్ట్ షాపుల వద్ద, వైన్ షాప్ యాజమాన్యల వద్ద నెల తప్పకుండా వసూళ్లు చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. వీరిపై విచారణ జరిపి చర్యలు తీసుకుని కార్యాలయంలో కొత్త వారిని నియమించాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.






