రంగు మారుతున్న రాజకీయం పై చర్చ...

by Disha Web Desk 11 |
రంగు మారుతున్న రాజకీయం పై చర్చ...
X

దిశ, నారాయణపేట ప్రతినిధి: నారాయణపేట నియోజకవర్గం తో పాటు జిల్లా పరిధిలో రంగులు మారుతున్న రాజకీయం రోజురోజుకు పెరుగుతోంది. ఇన్ని రోజులు ఒక పార్టీలో ఉండి జై తెలంగాణ నినాదంతో ముందుకు సాగిన వారు అధికారం పోగానే తమ ఉనికిని చాటుకునేందుకు తిరిగి అధికార పార్టీలోకి వలసలు వస్తున్నారు. అధికారం ఉంటే ఒక పార్టీ అధికారం లేకపోతే ఒక పార్టీ అంటూ అటు ఇటు అంటూ ముందుకు సాగుతున్నారు. ఈ అంశంపై ప్రజలు రంగులు మార్చుతున్న రాజకీయ నాయకులపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎందుకోసం పార్టీలు మారుతున్నారు? పార్టీలు మారాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయని ప్రజలు అంచనా వేసుకొని చర్చ కొనసాగిస్తున్నారు.

రాజకీయ నాయకులపై ప్రజలకు నమ్మకం కలిగేదెలా?

ఈ మధ్యనే నారాయణపేట నియోజకవర్గం చెందిన పలువురు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఎమ్మెల్యేను తామే స్వయంగా కష్టపడి గెలిపించామనే ధీమాతో తమ ఉనికిని చాటుకుంటున్నారు. అయితే కష్టపడింది మేమైతే మధ్యలో వచ్చి మమ్మల్ని తక్కువ చేయడం ఏమిటి అనేలా కిందిస్థాయి నాయకులు కార్యకర్తలు తమ రాజకీయ భవిష్యత్తుపై ప్రశ్నించుకుంటున్నారు. అధికారం లేకపోయినా పది సంవత్సరాలపాటు పార్టీ కోసం కష్టపడి తమ అభిమాన నాయకుడి మేనకోడలను ఎమ్మెల్యేగా గెలిపించుకున్నామని ఇప్పుడు పార్టీలో చేర్చుకోవడం ఏమిటని బయటికి చెప్పుకోకుండా తమలో తాము లోలోపల గుసగుసలాడుతున్నారు.

రాబోయే ఎన్నికల్లో టికెట్ల కోసమే ఆశ...

రాబోయే సర్పంచ్ ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో నిలిచి ఏదైనా ఒక ప్రజా ప్రతినిధి హోదా పొందాలనే ఉద్దేశంతోనే ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. అయితే ఎంతోమంది కాంగ్రెస్ నాయకులు అధికారం వచ్చిన తర్వాత తమకు న్యాయం జరుగుతుందని భావించి పార్టీ కోసం పనిచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోకి వలసలు వచ్చి వచ్చే ఎన్నికల కోసం ఎదురుచూస్తున్న ఆశావాహుల రాకతో ఏళ్ల తరబడి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వారికి న్యాయం ఏ విధంగా జరుగుతుందో వేచి చూడాల్సిందే మరి.

Next Story

Most Viewed