- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీసుల వేధింపులే ప్రాణం తీశాయా..?
జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలో తీవ్ర విషాదంతో పాటు ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసుల వేధింపులు తాళలేకనే ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ బాధితుడి బంధువులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు.

దిశ, గద్వాల క్రైమ్ : జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలో తీవ్ర విషాదంతో పాటు ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసుల వేధింపులు తాళలేకనే ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ బాధితుడి బంధువులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
అసలేం జరిగిందంటే..?
మల్దకల్ గ్రామానికి చెందిన మల్లేష్ అనే వ్యక్తి గత నెల 25న రాణమ్మ అనే మహిళపై హత్యా యత్నం చేసి పరారీలో ఉన్నాడు. అయితే మల్లేష్ ఆచూకీ కోసం పోలీసులు అతని బంధువులను విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే మల్లేష్‌కు బంధువైన శేషన్న (35) మల్లేష్‌తో టచ్‌లో ఉన్నాడని గుర్తించిన పోలీసులు, అతడిని స్టేషన్‌కు పిలిపించి విచారించారు. పోలీసుల విచారణతో మనస్తాపం చెందిన శేషన్న, ఇంటికి వెళ్ళిన తర్వాత మల్దకల్ శివారులోని తన పొలంలో చెట్టుకు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
విచారణ పేరిట చిత్రహింసలు?
శేషన్న భార్య, తల్లి పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. నిందితుడి ఆచూకీ కోసం శేషన్నను స్టేషన్‌లో దారుణంగా కొట్టారని, బూతులు తిడుతూ బెదిరించారని వారు కన్నీటి పర్యంతమయ్యారు. "నీ కొడుకుని జైలుకు పంపిస్తాం, ఇక ఎన్నటికీ తిరిగి రాడు" అని పోలీసులు బెదిరించడం వల్లే శేషన్న మనస్తాపం చెందాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై గద్వాల సీఐ శ్రీను వాసులు స్పందించారు. డయల్ 100 నుంచి వచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించారని తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు అందిన తర్వాత పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
ఆందోళన విరమణ
అంతకుముందు గద్వాల ఏరియా హాస్పిటల్ వద్ద బంధువులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీసుల వాహనాలను అడ్డుకున్నారు. అయితే, సీఐ శ్రీను వాసులు, ఇతర అధికారులు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో బంధువులు శాంతించి ఆందోళన విరమించారు.






