అభివృద్ధి ఓడింది.. అరాచకం గెలిచింది : మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి

by Ratna Kumari |

అడుగడుగునా అధికారదుర్విని యోగం, డబ్బు రాజకీయాలు, బెదిరింపులను తట్టుకుని బీఆర్ఎస్ పోరాడిందని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి పేర్కొన్నారు.

అభివృద్ధి ఓడింది.. అరాచకం గెలిచింది : మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి
X

దిశ, కొల్లాపూర్ : అడుగడుగునా అధికారదుర్విని యోగం, డబ్బు రాజకీయాలు, బెదిరింపులను తట్టుకుని బీఆర్ఎస్ పోరాడిందని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యల వల్ల అభివృద్ధి ఓడింది. అరాచకం గెలిచిందని ఆయన శనివారం ఓ ప్రకటనలో వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి తో పాటు మంత్రులు సహా యావత్ ప్రభుత్వ యంత్రాంగం ఒక్కటై కొట్లాడినా మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను నిలువరించలేకపోయారని ఆయన అన్నారు. కాంగ్రెస్ సాధించిన దొడ్డిదారి విజయం అప్రజాస్వామిక పాలనకు చెంపపెట్టని ఆయన అభివర్ణించారు. ఎక్కడ చూసినా డబ్బు, మద్యం , బెదిరింపులతో కాంగ్రెస్ విలువలను మంటగల్పిందని, పోలీసులు పూర్తిగా కాంగ్రెస్ కార్యకర్తల మాదిరిగా వ్యవహరించి ఆకృత్యాలకు పాల్పడ్డారని ఆయన మండిపడ్డారు. వీటన్నింటినీ తట్టుకుని పోరాడిన బీఆర్ఎస్ కాంగ్రెస్, బీజేపీ లకు వణుకు పుట్టించిందన్నారు.

అరాచకాలు, అక్రమాలకు భయపడకుండా మున్సిపల్ ఎన్నికల్లో వీరోచితంగా పోరాడిన పార్టీ నేతలు, కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. దాదాపు 720కి పైగా వార్డుల్లో బీఆర్ఎస్ గెలుపు సాధించడం యాదృచ్ఛికం కాదన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వంపై రోజురోజుకూ పెరుగుతున్న ప్రజావ్యతిరేకతకు నిలువెత్తు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. పల్లెలు, పట్టణం తేడా లేకుండా రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి మందగించిందని హర్షవర్ధన్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల హామీలు గాలిలో కలిపి, సంక్షేమ పథకాలను అటకెక్కించిన పాపం ఊరికే పోదన్నారు. అందుకే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీకి ఓటు అనే ఆయుధంతో ప్రజలు బుద్ధి చెప్పారని ఆయన చెప్పారు. కాంగ్రెస్‌ను గద్దె దించే శక్తి ఒక్క బీఆర్ఎస్ కు మాత్రమే ఉందని, భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ దేనని, మొన్న పంచాయితీ ఫలితాలు, నేడు మున్సిపల్ ఫలితాలు కుండబద్దలు కొట్టినట్టు రుజువు చేశాయని హర్షన్ వర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.

Next Story