పోతిరెడ్డి చెరువు అలుగు నీటిలో గల్లంతైన వృద్ధ దంపతుల మృతదేహాలు లభ్యం

by Nallavelli.Anjaneyulu |

దిశ, జడ్చర్ల : జడ్చర్ల మండల పరిధిలోని కిష్టారం గ్రామం అంబఠాపూర్ గ్రామానికి చెందిన తానేం బాలయ్య రాములమ్మ దంపతులు మూడు రోజుల క్రితం కిష్టారం గ్రామానికి వెళ్లి వస్తుండగా..

పోతిరెడ్డి చెరువు అలుగు నీటిలో గల్లంతైన వృద్ధ దంపతుల మృతదేహాలు లభ్యం
X

దిశ, జడ్చర్ల : జడ్చర్ల మండల పరిధిలోని కిష్టారం గ్రామం అంబఠాపూర్ గ్రామానికి చెందిన తానేం బాలయ్య రాములమ్మ దంపతులు మూడు రోజుల క్రితం కిష్టారం గ్రామానికి వెళ్లి వస్తుండగా.. కిష్టారం గ్రామ పోతిరెడ్డి చెరువు అలుగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో అలుగులో ప్రమాదవశాత్తు జారిపడి వృద్ధ దంపతులు ఇద్దరు గల్లంతైన విషయం తెలిసిందే. గత మూడు రోజులుగా ప్రభుత్వ యంత్రాంగం ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వృద్ధ దంపతుల మృతదేహాల కొరకు గాలింపు చర్యలు ముమ్మరంగా చేపట్టారు. దీంతో గల్లంతైన మూడోరోజు శనివారం తనేం బాలయ్య- రాములమ్మ దంపతుల మృతదేహాలను ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వెతికి తీశారు. దీంతో సంఘటన స్థలం వద్ద మృతుల కుటుంబ సభ్యులు గ్రామస్తుల రోద‌న‌లు మిన్నంటాయి. మూడు రోజుల నుండి గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికి తీసిన ఎస్డిఆర్ఎఫ్ సిబ్బందిని అధికారులు గ్రామస్తులు అభినందించారు.

అలుగులో గల్లంతై వృద్ధ దంపతుల మృతి బాధాకరం : ఎమ్మెల్యే

కిష్టారం గ్రామం అంబఠాపూర్ గ్రామానికి చెందిన బాలయ్య, రాములమ్మ దంపతులు పోతిరెడ్డి చెరువు అలుగులో పడి గల్లంతయి మృతి చెందడం బాధాకరమని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి అన్నారు. శనివారం కిష్టారం ,అంబఠాపూర్ గ్రామానికి వెళ్లి మృతదేహాలకు నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా తక్షణ చర్యలు తీసుకుంటామని, తొందరలోనే కిష్టారం గ్రామానికి బీటీ రోడ్ మంజూరయ్యేలా చర్యలు చేపడతానని అలుగు వద్ద హై లెవెల్ నిర్మాణానికి చర్యలు చేపడతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

మృతుల కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి : బీఆర్ఎస్

కాగా కృష్టారం పోతిరెడ్డి చెరువు ఘటన స్థలానికి చేరుకున్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. వృద్ధ దంపతుల మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వపరంగా నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Next Story