కల్వర్టు నాణ్యతకు తిలోదకాలు!

by Kodari Anjali |

అచ్చంపేట - సిద్ధాపూర్ ప్రధాన రహదారిపై నక్కమరి వాగు కల్వర్టు నిర్మాణం పూర్తికాకముందే కృంగిపోయింది.

కల్వర్టు నాణ్యతకు తిలోదకాలు!
X

అచ్చంపేట - సిద్ధాపూర్ ప్రధాన రహదారిపై నక్కమరి వాగు కల్వర్టు నిర్మాణం పూర్తికాకముందే కృంగిపోయింది. కాంట్రాక్టర్ ఎర్రమట్టితో కూడిన నాణ్యతలేని ఇసుకను వాడడమే ఈ ఘోరానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ నిర్మాణ అవకతవకలపై ఏప్రిల్ 17నే ‘దిశ’ కథనం ద్వారా హెచ్చరించినా ఆర్‌అండ్‌బీ శాఖ పట్టించుకోలేదు. నాణ్యత లోపాలపై ఆనాడే డీఈ జలంధర్‌రెడ్డికి ఫిర్యాదు చేసినా, ఆయన కాంట్రాక్టర్‌కే వత్తాసు పలికారు. అధికారులు, కాంట్రాక్టర్ కుమ్మక్కు కావడంతో లక్షలాది రూపాయల ప్రజాధనం వాగుపాలైంది. ఈ రహదారి ద్వారా నిత్యం 20గ్రామాలతోపాటు దేవరకొండ ప్రాంతానికి ప్రధాన రవాణా సౌకర్యంగా కొనసాగుతుంది. వర్షాలు పడితే కల్వర్టు పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉందని, తక్షణమే ఉన్నతాధికారులు విచారణ జరపాలని జనం కోరుతున్నారు.

దిశ, అచ్చంపేట: నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట మండలంలోని బొమ్మనపల్లి గ్రామ సమీపంలోని అచ్చంపేట - సిద్ధాపూర్ ప్రధాన రహదారి నక్కమరి వాగుపై నిర్మిస్తున్న కల్వర్టు నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారు. మన్నికలేని, ఎర్రమట్టితో కూడిన ఇసుకను ఉపయోగించి పనులు చేపట్టడం వల్ల నిర్మాణం పూర్తికాకముందే కల్వర్టు కృంగిపోతోంది. దీంతో ప్రజాసొమ్ము పూర్తిగా దుర్వినియోగం అవుతోందని, జరుగుతున్న పనుల నాణ్యతపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కల్వర్టు నిర్మాణంలో భారీ అవకతవకలు, నాణ్యత లోపాలు ఉన్నాయని ఏప్రిల్ 17న ‘దిశ’ పత్రికా కథనంతో ముందుగానే హెచ్చరించినప్పటికీ సంబంధిత ఆర్‌అండ్‌బీ అధికారులు కళ్లు తెరవలేదు. దగ్గరుండి మన్నికలేని పనులను నిలుపుదల చేయించకుండా కాంట్రాక్టర్‌కు సహకరించడం వల్లే నేటి దుస్థితి దాపురించిందని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు.

అధికారులు, కాంట్రాక్టర్ కుమ్మక్కు...

మన్నికలేని కల్వర్టు నిర్మాణ పనులు జరుగుతున్నాయని ఆనాడే సంబంధిత ఆర్‌అండ్‌బీ డీఈ జలంధర్‌రెడ్డి దృష్టికి ‘దిశ’ ప్రతినిధి తీసుకెళ్లినప్పటికీ ఆయన ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ కల్వర్టు నిర్మాణం విషయంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహించడం, పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరించడం వెనుక ముడుపుల కక్కుర్తి ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు, కాంట్రాక్టర్ కుమ్మక్కై వ్యవహరించిన నిర్లక్ష్య ధోరణి ఫలితంగానే, నేడు నిర్మాణం పూర్తికాకముందే కల్వర్టులో కొన్ని భాగాలు భారీగా కృంగిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

ప్రమాదకరంగా 20 గ్రామాల రాకపోకలు..

అచ్చంపేట ప్రధాన పట్టణంలోని ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లేందుకు ఇది అత్యంత కీలకమైన రోడ్డు మార్గం. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈ కల్వర్టు పరిస్థితిపై సర్వత్రా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ రహదారి ద్వారా అచ్చంపేట మండలంలోని దాదాపు 20గ్రామాలకు, అలాగే నల్గొండ జిల్లా దేవరకొండ ప్రాంతానికి నిరంతరం వందలాది వాహనాలు రాకపోకలు కొనసాగిస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో కల్వర్టు మరింత బలహీనంగా మారి కూలిపోతే, జరిగే ప్రాణ, ఆస్తి నష్టాలకు బాధ్యత ఎవరు వహిస్తారని అటుగా వెళ్లే ప్రయాణికులు, పరిసర గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

వివరణకు దొరకని డీఈ...

ఈ కల్వర్టు వ్యవహారంపై సంబంధిత ఆర్‌అండ్‌బీ డీఈ జలంధర్‌రెడ్డిని ‘దిశ’ మంగళవారం ఫోన్ ద్వారా వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. అయితే, నిర్మాణం ప్రారంభ దశలోనే నాణ్యత లోపాలపై మీడియా ప్రశ్నించినప్పుడు.. ‘అలా ఏమీ లేదు, పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదు, పనులు జరగనీయండి’ అంటూ ఆయన కాంట్రాక్టర్‌కు వత్తాసు పలికేలా మాట్లాడడం గమనార్హం. మీడియా ద్వారా అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో కల్వర్టును పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story