- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాల్యంలోనే ఏఐ పాఠాలు.. విద్యాశాఖ కొత్త కార్యాచరణ ఇదే!
రాష్ట్రంలోని పాఠశాల విద్యలో విద్యాశాఖ సంస్కరణల్లో భాగంగా మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా విద్యార్థులను బాల్యం నుంచే సిద్ధం చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని పాఠశాల విద్యలో విద్యాశాఖ సంస్కరణల్లో భాగంగా మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా విద్యార్థులను బాల్యం నుంచే సిద్ధం చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. విద్యార్థులకు టెక్నాలజీని చేరువ చేస్తూ 3 నుంచి 5వ తరగతి పిల్లలకు వారానికి 80 నిమిషాల పాటు ఏఐ పాఠాలు చెప్పనున్నారు. మ్యాథ్స్, తెలుగు, ఇంగ్లీష్ సబ్జెక్టుల్లో పిల్లల సామర్థ్యాలను పెంచేందుకు ఏఐ టూల్స్ వాడనున్నారు. గణితానికి 20 నిమిషాల చొప్పున వారానికి రెండు సార్లు, భాషా సబ్జెక్టులకు అంతే సమానంగా మొత్తం 80 నిమిషాల పాటు ఏఐ సాఫ్ట్ వేర్ తో పాఠాలు నేర్చుకుంటారు. ఇప్పటివరకు కేవలం ప్రభుత్వ పాఠశాలలకే పరిమితమైన ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) ప్రోగ్రాంను ఈ విద్యా సంవత్సరం 2026-27 నుంచి అన్ని ప్రైవేటు పాఠశాలల్లోనూ తప్పనిసరి చేస్తూ పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. తరగతులకు తగిన విధంగా అభ్యసన సామర్థ్యాలను పెంపొందించే లక్ష్యంతో 1 నుంచి 5వ తరగతి వరకు చదివే విద్యార్థులందరికీ ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.
మెరుగుపడిన ర్యాంక్
నాలుగేళ్లుగా చేపట్టిన ప్రణాళికలతో జాతీయ స్థాయి సర్వేల్లో తెలంగాణ ర్యాంకు 36 నుంచి 26 కు మెరుగుపడిందని, దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ విద్యా సంవత్సరం పకడ్బందీ ప్రణాళికలు రూపొందించారు. జాతీయ స్థాయిలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యా ప్రమాణాలను పెంచడం, ర్యాంకింగుల్లో మెరుగైన స్థానాన్ని సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది.
మూడు రకాల పరీక్షలు
పిల్లల్లో ప్రాథమిక స్థాయిలోనే చదవడం, రాయడం, గణిత నైపుణ్యాలతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. అలాగే మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు లెర్నింగ్ ఎన్ రిచ్ మెంట్ పీరియడ్ పేరుతో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఏడాదిలో మూడు సార్లు జులైలో బేస్ లైన్ టెస్ట్, నవంబర్ లో మిడ్ లైన్ పరీక్షలు, మార్చిలో ఎండ్ లైన్ పరీక్షలు నిర్వహించి వాటి వివరాలను స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ లో నమోదు చేయాల్సి ఉంటుంది. తరగతి గదిలో వెనుకబడిన పిల్లల కోసం టీచర్ సపోర్టు గ్రూపులను ఏర్పాటుచేసి అందరికీ కనీస సామర్థ్యాలు మెరుగుపడేలా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.






