గద్వాల విద్యుత్ శాఖలో అవినీతి అధికారుల బాగోతం బట్టబయలు

by Nallavelli.Anjaneyulu |

గద్వాల విద్యుత్ శాఖలో అవినీతి అధికారుల బాగోతం బట్టబయలు అయింది.

గద్వాల విద్యుత్ శాఖలో అవినీతి అధికారుల బాగోతం బట్టబయలు
X

దిశ, గద్వాల క్రైమ్ : జోగులాంబ గద్వాల జిల్లా విద్యుత్ శాఖలో తిష్టవేసిన అవినీతి తిమింగలాల అసలు స్వరూపం విజిలెన్స్ విచారణలో బ‌ట్ట‌బ‌య‌లు అయింది. వినియోగదారుల అవసరాలను ఆసరాగా చేసుకుని అందినకాడికి దండుకుంటున్న అధికారులపై TGSPDCL విజిలెన్స్ విభాగం (CVO) జరిపిన విచారణలో సంచలన విష‌యాలు వెలుగుచూశాయి. గద్వాల సర్కిల్‌కు చెందిన ఒక ఏఈ (AE), ఒక లైన్‌మెన్ లంచం తీసుకున్నట్టు సాక్ష్యాధారాలతో సహా నిరూపణ కావడంతో వారిపై శాఖపరమైన చర్యలకు మార్గం సుగమమైంది. శాంతినగర్ సెక్షన్‌కు చెందిన ఏఈ (AE/OP/Shanthinaar) చిన్న సుబ్బరాయుడు ఒక పని నిమిత్తం వినియోగదారుడి నుండి రూ. 25,000 లంచం డిమాండ్ చేసి తీసుకున్నట్లు విజిలెన్స్ నివేదిక స్పష్టం చేసింది. ఇతని పై వచ్చిన అవినీతి ఆరోపణలు (Ref No: 232-C2/2025) పూర్తిగా నిజమని తేలడంతో ఉన్నతాధికారులు నివేదికను సిద్ధం చేశారు.

అలాగే గద్వాల సర్కిల్ పరిధిలోని అల్వాల పాడు(Alwalpad) సెక్షన్‌కు చెందిన లైన్‌మెన్ షేక్ షావలి కూడా అవినీతికి పాల్పడినట్లు నిర్ధారణ అయింది. ఒక సామాన్య వినియోగదారుడి నుంచి రూ. 2,500 లంచం తీసుకుంటూ పట్టుబడటంతో ఇతనిపై మోపబడిన అవినీతి అభియోగాలు (Ref No: 18-C2/2026) విచారణలో రుజువయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ విజిలెన్స్ తనిఖీల్లో జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన ఈ ఇద్దరు అధికారులు అక్రమాలకు పాల్పడినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. నివేదిక ప్రకారం.. వీరిద్దరిపై మోపబడిన అవినీతి ఆరోపణలు (Corruption Charges Proved) అధికారికంగా ధృవీకరించబడటంతో, వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ విభాగం ఉన్నతాధికారులకు సిఫార్సు చేసింది. విద్యుత్ శాఖలో ఉన్న ఇలాంటి అవినీతి అధికారుల తీరుపై స్థానిక వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story