- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలి: కలెక్టర్
రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా యూరియా ఎరువులను సకాలంలో, పారదర్శకంగా, సమర్థవంతంగా పంపిణీ చేయాలని కలెక్టర్ అన్నారు.

దిశ, బిజినేపల్లి: రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా యూరియా ఎరువులను సకాలంలో, పారదర్శకంగా, సమర్థవంతంగా పంపిణీ చేయాలని, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలు, లాభదాయకమైన కూరగాయల సాగుపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్, సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. సోమవారం ఉదయం బిజినేపల్లి మండల కేంద్రంలోని మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ రైతులకు యూరియా పంపిణీ జరుగుతున్న తీరును ప్రత్యక్షంగా పరిశీలించి, రైతులతో మాట్లాడి ఎరువుల లభ్యత, పంపిణీ విధానం, ఎదురవుతున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువులు పొందేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు, సహకార శాఖ అధికారులతో కలెక్టర్ మండలంలో ప్రస్తుతం ఉన్న యూరియా నిల్వలు, రైతుల డిమాండ్, పంపిణీ ప్రక్రియ, పంటల సాగు విస్తీర్ణం, వర్షపాతం పరిస్థితులు తదితర అంశాలపై సమగ్రంగా ఆరా తీశారు. రైతులకు అవసరమైన సమయంలో ఎరువులు అందుబాటులో ఉండేలా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని, నిల్వలను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశించారు.
పత్తి పంటల సాగు జరిగింది..
వ్యవసాయ శాఖ అధికారులు కలెక్టర్‌కు వివరాలు అందిస్తూ బిజినేపల్లి మండలంలో ప్రస్తుతం మొత్తం 244 టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, వాటిలో మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో 62 టన్నుల యూరియా నిల్వ ఉందని, రైతులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న అవసరాలకు అనుగుణంగా బయోమెట్రిక్ విధానంలో పారదర్శకంగా పంపిణీ జరుగుతోందని, ఎరువుల కొరత లేకుండా ఎప్పటికప్పుడు అదనపు నిల్వలు కూడా అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. మండలంలోని వ్యవసాయ పరిస్థితులను వివరిస్తూ, ఈ ఖరీఫ్ సీజన్‌లో సుమారు 12,345 ఎకరాల్లో పత్తి పంటల సాగు జరిగిందని, ఇప్పటివరకు 31 ఎకరాల్లో వరి, 45 ఎకరాల్లో మొక్కజొన్న, 79 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు ప్రారంభమైనట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. రానున్న రోజుల్లో వర్షాలు కురిసిన వెంటనే సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..... రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందన్నారు. యూరియా పంపిణీలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని, రైతుల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు...
యూరియా బ్లాక్ మార్కెట్‌కు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, ప్రతి బస్తా అర్హులైన రైతులకే అందేలా చూడాలని సూచించారు. ఈ ఏడాది వర్షపాతం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని పంటల ఎంపిక చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో అధిక దిగుబడి ఇచ్చే జొన్న, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలు సాగు చేయడం ద్వారా వ్యయాన్ని తగ్గించుకోవచ్చని, అలాగే మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న లాభదాయకమైన కూరగాయల సాగుపై రైతులకు అవగాహన కల్పించి ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. రైతులు శాస్త్రవేత్తలు, వ్యవసాయ విస్తరణ అధికారుల సలహాలు పాటిస్తూ శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేపడితే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించవచ్చని, వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు అందించాలని, పంటల ప్రణాళిక, ఎరువుల వినియోగం, నీటి యాజమాన్యంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంట తాహసిల్దార్ మునీరుద్దీన్, నాగర్ కర్నూల్ డివిజన్ వ్యవసాయ శాఖ అధికారి పూర్ణచంద్ర్ రావు, మండల వ్యవసాయ అధికారులు కమల్ కుమార్ తో పాటు తదితరులు ఉన్నారు.






