అంకిత భావం, క్రమశిక్షణతో చదవాలి: కలెక్టర్ ప్రియాంక

by Kodari Anjali |

ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు పూర్తి అంకిత భావం, క్రమశిక్షణతో చదవాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక సూచించారు.

అంకిత భావం, క్రమశిక్షణతో చదవాలి: కలెక్టర్ ప్రియాంక
X

దిశ, నారాయణపేట ప్రతినిధి: ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు పూర్తి అంకిత భావం, క్రమశిక్షణతో చదవాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రం లోని అశోక్ నగర్ కు వెళ్లే మార్గంలో గల లయన్స్ క్లబ్ భవనంలో ఆ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని, వారియర్స్ డిఫెన్స్ అకాడమీ/లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఇస్తున్న శిక్షణా కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ శిక్షణ పొందుతున్న యువతీ యువకులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ.. సుమారు 15 సంవత్సరాల క్రితం తాను కూడా ఇలాగే ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమయ్యాననీ తెలిపారు. ఇప్పటికీ ఎంతో మంది ఆసక్తితో చదువుకోవడం చూస్తే చాలా సంతోషంగా ఉంటుందన్నారు. శిక్షణ పొందుతున్న వారు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, రాయబోయేది కేవలం ఒక పరీక్ష మాత్రమే. మనం 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ పరీక్షలు ఎలా రాశామో, ఇదీ అలాంటి మరో పరీక్షగానే భావించాలని చెప్పారు. అనవసరంగా ఒత్తిడికి గురికావద్దన్నారు.

మార్కులు కోల్పోయే అవకాశం ఉంటుందనే..

ప్రతి ఒక్కరికి అవసరమైంది ఒక్క సీటు మాత్రమే అని "ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది?", "ఎంత మంది పరీక్ష రాస్తున్నారు?", "పరీక్ష వాయిదా పడుతుంది", "పరీక్ష జరగదు" వంటి పుకార్లను అస్సలు నమ్మ రాదని తెలిపారు. ప్రభుత్వ పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు పూర్తి అంకితభావంతో, క్రమశిక్షణతో చదవాలని ఆమె పునరుద్ఘాటించారు. ఒక్క వారం చదవకుండా వదిలేస్తే, అదే సమయంలో చదవాల్సిన ప్రశ్న పరీక్షలో వచ్చి మార్కులు కోల్పోయే అవకాశం ఉంటుందనే భావనతో ప్రతిరోజూ చదవాలన్నారు. తాను కూడా అదే విధంగా సిద్ధమయ్యాననీ, అదే తనకు మంచి ఫలితాన్ని ఇచ్చిందనీ చెప్పారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు హరినారాయణ బట్టాడ్,ఆత్మారామ్ ఎడ్కే, లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షుడు రవికుమార్ గౌడ్, శ్రీనివాస్ లాహోటీ, బాలాజీ, జనార్దన్, సచిన్ మంగగ్లీ, తదితరులు పాల్గొన్నారు.

Next Story