సీఎం సొంత మండ‌లంలో రైతుల కోసం బీఆర్ఎస్ మ‌హాధ‌ర్నా

by Ratna Kumari |

మండల కేంద్రంలో బుధవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల సమస్యల పరిష్కారం కోసం మహా రైతు ధర్నా నిర్వహించారు.

సీఎం సొంత మండ‌లంలో రైతుల కోసం బీఆర్ఎస్ మ‌హాధ‌ర్నా
X

దిశ, వంగూరు : మండల కేంద్రంలో బుధవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల సమస్యల పరిష్కారం కోసం మహా రైతు ధర్నా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, జైపాల్ యాదవ్, గోలి శ్రీనివాస్ రెడ్డి లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం సొంత మండలంలోనే రైతులు పండించిన వరి, మొక్క జొన్న ధాన్యాలను కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేయకపోవడమే కాకుండా మిల్లర్లు క్వింటాల్‌కు 8 నుంచి 12 కిలోల వరకు తరుగు తీస్తూ రైతులను తీవ్రంగా నష్టపరు స్తున్నారని విమర్శించారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో రైతులు ఎప్పుడూ యూరియా కోసం ఇబ్బందులు పడలేదని పేర్కొన్నారు.

బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మండలంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. ఒక కొండారెడ్డిపల్లి గ్రామం తప్ప మిగతా గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదన్నారు. సీఎం సొంత మండలంలోనే రైతులు ధాన్యం అమ్ముకోవడానికి ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. మహిళలకు రూ.2500, పింఛన్లు రూ.4000, గ్యాస్ సిలిండర్ రూ.500కు అందిస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. రైతుబంధు కూడా సక్రమంగా అందించలేని పరిస్థితి నెలకొంద న్నారు. మళ్లీ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, సీఎం కేసీఆర్ నాయక త్వంలో రైతులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. అనంతరం ర్యాలీగా వెళ్లి మండల తహసిల్దార్ మురళీమోహన్ కు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జయపాల్ యాదవ్, గోలి శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ భీమా, పోకల మనోహర్, మండల సీనియర్ నాయకులు గణేష్ రావు, అంకు సురేందర్, రాజేందర్ రెడ్డి, నరేందర్ రావు, పుల్లయ్య, కొమ్ము శ్రీనివాస్, శ్రీపతిరావు వివిధ గ్రామాల సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

Next Story