పాలమూరులో బీజేపీ, కాంగ్రెస్ రాజకీయ యుద్ధం

by Disha Web Desk 12 |
పాలమూరులో బీజేపీ, కాంగ్రెస్ రాజకీయ యుద్ధం
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికలు 20-20 క్రికెట్ మ్యాచ్ ను తలపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రధాన రాజకీయ పార్టీలు ఈ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఎలాగైనా ఈ స్థానం నుంచి గెలవాలని ఎవరి ప్రయత్నాలు వారు సాగిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ప్రధాన పోటీ కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి డీకే అరుణ మధ్య సాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డికి ఈ స్థానం అగ్ని పరీక్షగా మారింది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఈ స్థానం నుంచి వంశీ చంద్ రెడ్డిని గెలిపించుకోవడానికి ఎత్తులు వేస్తూ ఉంటే.. భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తన రాజకీయ అనుభవాన్ని అంతా వినియోగిస్తూ.. ప్రచారంలో అధికార పార్టీ అభ్యర్థికి దీటుగా సాగుతోంది.

మోడీ పట్ల ప్రజల్లో ఉన్న అభిమానం తనను గట్టెక్కిస్తుందని డీకే అరుణ భావిస్తుండగా.. రేవంత్ రెడ్డి ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, పార్టీ అధికారంలో ఉండడం, నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ పార్టీ వారే కావడం, ముఖ్య నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరడం తమకు కలిసి వస్తుందన్న ధీమాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీచందర్ రెడ్డి ఉన్నారు. ప్రధాన పోటీ ఈ ఇద్దరు అభ్యర్థుల మధ్య ఉంటుందని భావిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి తరఫున ఆ పార్టీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. ఇప్పుడిప్పుడే ప్రచారాలను మొదలుపెట్టారు. నియోజకవర్గాల వారీగా విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తున్న ఇంకా ఆ అభ్యర్థి జాతీయ పార్టీల అభ్యర్థులకు పోటీని ఇచ్చే స్థాయికి రాలేదు.

ఆ రెండు పార్టీల మధ్య విమర్శలు..

ఒకవైపు సూర్యుని ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి.. మరోవైపు ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య సాగుతున్న పరస్పర ఆరోపణలతో నెలకొంటున్న ఉత్కంఠ భరిత వాతావరణం అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి వంశి చంద్ రెడ్డి, ఇతర నేతలు అంతా బీజేపీ, బీఆర్ఎస్ లపై, పార్టీ అభ్యర్థులపై ఘాటుగా వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటే.. అదే స్థాయిలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విరుచుకుపడుతోంది. పార్టీల పరంగానే కాకుండా వ్యక్తిగతంగా బహిరంగ సభలు, మీడియా సమావేశాలలో చేసుకుంటున్న విమర్శలు రాజకీయ హీట్ ను పెంచుతున్నాయి. అభ్యర్థులలో ఎవరు గెలుస్తారంటే పలానా తప్పకుండా గెలవడానికి అవకాశం ఉందని చెప్పే పరిస్థితులు లేవు.

కొన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తాడంటే లేదు లేదు బీజేపీ అభ్యర్థికి అవకాశాలు ఉన్నాయని కొందరు అంటుంటే.. లేదు కాంగ్రెస్, బీజేపీని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని, తప్పకుండా తమ అభ్యర్థి గెలుస్తాడని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు. మూడు పార్టీలు ఈ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారాలు సాగిస్తున్నారు. బుధవారం నుంచి నామినేషన్ల ఘట్టం ప్రారంభమవుతుండటంతో ఎన్నికల ప్రచార హోరు... పరస్పర విమర్శలు మరింత రాజకీయ వేడిని పుట్టించడం ఖాయమని రాజకీయ నాయకులు అంటున్నారు. 20-20 క్రికెట్ మ్యాచ్ ను తలపించడం తథ్యమని పలువురు అంటున్నారు.


Next Story

Most Viewed