చిన్నోని పల్లె చుట్టూ.. నడిగడ్డ రాజకీయాలు

by Malleboina Mahesh |

ఉమ్మడి పాలమూరు జిల్లా నడిగడ్డ(జోగులాంబ గద్వాల జిల్లా) రాజకీయాలది మొదటి నుంచి విశిష్టమైన స్థానం.

చిన్నోని పల్లె చుట్టూ.. నడిగడ్డ రాజకీయాలు
X

దిశ బ్యూరో, మహబూబ్ నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లా నడిగడ్డ(జోగులాంబ గద్వాల జిల్లా) రాజకీయాలది మొదటి నుంచి విశిష్టమైన స్థానం. ఇక్కడ ఎక్కువగా సాగునీటి అంశాలు, కరువు కాటకాలను, తెరపైకి తీసుకువచ్చి రాజకీయాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నడిగడ్డలో మరోసారి సాగునీటి అంశాలకు సంబంధించిన వ్యవహారం రాజకీయ నాయకులకు అస్త్రంగా మారింది. గట్టు మండలంలో చిన్నోనిపల్లి రిజర్వాయర్ ను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం అవుతుంటే... అటు చిన్నోనిపల్లి, తదితర గ్రామాల ప్రజలు, రైతులు ఈ రిజర్వాయర్ నిర్మించడం వల్ల తమకు నష్టం తప్ప... ఫలితాలు ఉండవు... ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వాయర్ నిర్మించరాదని గత 424 రోజులుగా రిలే దీక్షలు చేస్తూ వస్తున్నారు.

ఈ రిజర్వాయర్ ను నిర్మించడం వల్ల 2500 ఎకరాల పొలం ఇవ్వడంతో పాటు ఇందువాసి, చిన్న పల్లి, చాగదోన, లింగాపురం, బోయలగూడెం తదితర గ్రామస్తులు నిర్వాసితులు కావలసిన పరిస్థితులు నెలకొన్నాయి... తాము నిర్వాసితులం అయినప్పటికిని.. భూములను కోల్పోయిన.. కేవలం 2600 ఎకరాలకు మించి సాగునీరు అందరూ అని... అటువంటి ఈ ప్రాజెక్టును నిర్మించి మమ్మల్ని ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తారని ఆరోపిస్తూ బాధితులు ఆందోళనలు చేస్తున్నారు... దీనివల్ల నడిగడ్డ రైతులకు జరిగే లాభం కన్నా.. ఆంధ్ర ప్రాంతానికి మేలు జరిగి... అధికార పార్టీ నాయకుల, కాంట్రాక్టర్ల జేబులు నింపడానికే పనికొస్తుంది అని పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితిలోనూ ఈ రిజర్వాయర్ ను నిర్మించవద్దని ఆయా గ్రామాల రైతులు ప్రజలతో పాటు.. ప్రజా సంఘాల నేతలు కూడా వారికి మద్దతుగా ఉంటూ పోరాటాలు సాగిస్తున్నారు.

2005లో చిన్నోనిపల్లి రిజర్వాయర్ నిర్మాణం కోసం 2500 ఎకరాలను... స్వాధీనం చేసుకొని.. రైతులకు అవార్డు కూడా ఇచ్చారు.. కానీ అప్పటి ప్రభుత్వం గానీ... అధికారంలోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం గానీ రిజర్వాయర్ నిర్మాణానికి చర్యలు తీసుకోకపోవడంతో... రైతులు ఇక రిజర్వాయర్ నిర్మాణం జరగదు అని... తాము ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదని భావించి... పొలాలను బాగు చేసుకుంటున్నారు... వ్యవసాయ బోర్లు వేసుకుని దిగుబడిని సాధించుకుంటున్నారు.. ఇన్ని సంవత్సరాల తర్వాత రిజర్వాయర్ నిర్మించడం సరికాదని రైతులు చేస్తున్న ఆందోళనలకు... రాజకీయాలు తోడు కావడంతో నడిగడ్డన ఆరంభమైన చిన్నోనిపల్లి సమస్య రాష్ట్ర వ్యాప్తంగా మారుమ్రోగుతోంది..

చిన్నోనిపల్లి చుట్టూ రాజకీయాలు..

చిన్నోనిపల్లి సమస్య చుట్టూ నడిగడ్డ రాజకీయాలు సాగుతున్నాయి... భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, బీఎస్పీ, నడిగడ్డ హక్కుల పోరాట సమితి... తదితరాలకు చెందిన ముఖ్యమైన నాయకులు కార్యకర్తలు... బాధిత రైతులకు గా ఉంటూ పోరాటాలు సాగిస్తున్నారు... రిజర్వాయర్ నిర్మించడం వల్ల ప్రయోజనం ఉండదు అని... అలాంటప్పుడు ఈ రిజర్వాయర్‌ను నిర్మించడం వల్ల ఎవరికి ప్రయోజనం ఉంటుందో నిర్ధారించాలి అని వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. రిజర్వాయర్ తప్పనిసరిగా నిర్మించవలసి వస్తే రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగిన తర్వాతనే రిజర్వాయర్ నిర్మాణం పనులు చేపట్టాలని... అందుకోసం ఎంతకైనా తెగించి పోరాటాలు చేస్తామంటూ ప్రతిపక్ష పార్టీల నేతలు స్పష్టం చేస్తున్నారు.

ఒకవైపు అధికార పార్టీ రైతుల ఆందోళనలను లెక్కచేయకుండా రిజర్వాయర్ను నిర్మించాలన్న తలంపుతో... పెద్ద ఎత్తున పోలీసులను మోహరింపజేసి... పలువురిని ... బాధితులకు అండగా నిలుస్తున్న ప్రతిపక్ష పార్టీల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఈ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.. ప్రభుత్వం ఈ విషయంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి... రిజర్వాయర్ను నిలిపి వేస్తుందా... లేక కొనసాగిస్తుందా అన్న అంశము తేలవలసి ఉంటుంది.

Next Story