- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు : కలెక్టర్ బాదావత్ సంతోష్
నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని నాగర్ కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ మున్సిపాలిటీల్లో మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు.

దిశ, కందనూల్ : నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని నాగర్ కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ మున్సిపాలిటీల్లో మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణీ కుముదిని గురువారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని మూడు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 65 వార్డులకు 131 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ కోసం అవసరమైన 158 బ్యాలెట్ బాక్సులతో పాటు అదనంగా 20 శాతం బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల బ్యాలెట్ పేపర్ల ముద్రణ కోసం మహబూబ్‌నగర్‌లో కేంద్రాన్ని గుర్తించామని, ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినట్లు కలెక్టర్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల వివరాలను ఇప్పటికే టీ-పోల్‌లో నమోదు చేసినట్లు, వాటిపై వచ్చిన అభ్యంతరాలను నిశితంగా పరిశీలించి పరిష్కరిస్తున్నట్లు వివరించారు.
ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని నియమిస్తూ, వారికి శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. షెడ్యూల్ విడుదలైన వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు ఎస్‌ఎస్‌టీ, ఎఫ్‌ఎస్‌టీ బృందాలను నియమించనున్నట్లు వెల్లడించారు. ఓటర్లలో చైతన్యం పెంచేందుకు సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేయనున్నట్లు పేర్కొన్నారు. బ్యాలెట్ బాక్సులు, ఇతర సామాగ్రి, బ్యాలెట్ పేపర్ల ముద్రణ, నామినేషన్ స్వీకరణ కేంద్రాలలో అవసరమైన సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, నోడల్, జోనల్ అధికారుల నియామకానికి సిబ్బందిని ఇప్పటికే గుర్తించినట్లు చెప్పారు. పోలింగ్ కేంద్రాల లోపలతో పాటు బయట కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వెబ్‌కాస్టింగ్, సామాగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూముల ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణీ కుముదిని ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా ఎన్నికలను సాఫీగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దేవ సహాయం, మున్సిపల్ కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు.






