- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లో నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నారాయణపేట, గద్వాల చేపట్టిన కీలక సాగునీటి ప్రాజెక్టుల సందర్శనకు రానున్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, మత్స్య శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఆదేశించారు.

దిశ, నారాయణపేట ప్రతినిధి : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లో నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నారాయణపేట, గద్వాల చేపట్టిన కీలక సాగునీటి ప్రాజెక్టుల సందర్శనకు రానున్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, మత్స్య శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి లు ఆదేశించారు. పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఎలాంటి లోటు పాట్లు లేకుండా పూర్తి చేయాలని ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఎమ్మెల్యేలు, సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్ నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్లు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యటన మార్గం, భద్రతా ఏర్పాట్లు, ప్రజా ప్రతినిధుల సమన్వయం, సాగునీటి ప్రాజెక్టుల వద్ద చేపట్టాల్సిన ఏర్పాట్ల పై సవివరంగా మంత్రులు అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగ సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. సాగునీటి రంగ అభివృద్ధి ద్వారా వ్యవసాయాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్మితమవుతున్న నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తయితే ఈ ప్రాంత రైతులకు వరంగా మార్పు చెందుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈనెల 4, 5 తేదీల్లో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రాజెక్టులను సందర్శించి వాటి పురోగతిని పరిశీలించనున్నారని చెప్పారు. సీఎం పర్యటన సందర్భంగా ప్రాజెక్టుల ప్రాధాన్యత, వాటి ద్వారా సాగులోకి వచ్చిన కొత్త ఆయకట్టు, రైతులకు కలిగిన ప్రయోజనాలు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలను సమగ్రంగా ముఖ్యమంత్రికి అధికారులకు సూచించారు. పర్యటనలో పాల్గొనే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, రవాణా, వైద్య సదుపాయాలు తదితర ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించారు.ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాల్లో అవసరమైన ముందస్తు చర్యలతో పాటు సాగునీటి ప్రాజెక్టుల సందర్శనకు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కార్యక్రమమని, జిల్లాల వారీగా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి అన్ని ఏర్పాట్లను సమయానికి పూర్తి చేయాలని సూచించారు.
భద్రతా ఏర్పాట్ల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా పోలీసు శాఖ అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రజాప్రతినిధులు మరియు అధికారుల మధ్య సమన్వయం మరింత మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని మంత్రి జూపల్లి సూచించారు. ముఖ్యమంత్రి ప్రాజెక్టుల సందర్శన పనుల పురోగతి తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉందని అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. నారాయణపేట కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక వీడియో కాన్ఫరెన్స్ సమావేశానికి హాజరయ్యారు. సీఎం సందర్శించే అన్ని ప్రాంతాలను జిల్లా ఎస్పీతో కలిసి తను స్వయంగా పర్యవేక్షించడం జరుగుతుందని, అక్కడ ఎలాంటి లోటుపాట్లు లేకుండా ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. సీఎం పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తోందని కలెక్టర్ తెలిపారు. ఎస్పీతో కలిసి తాను స్వయంగా పర్యటిస్తూ ముఖ్యమంత్రి సందర్శించనున్న అన్ని ప్రాంతాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్ల కోసం జిల్లా స్థాయి అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు. ఏర్పాట్ల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు సమావేశాలు నిర్వహిస్తూ, అవసరమైన ఆదేశాలు జారీ చేస్తున్నామని కలెక్టర్ మంత్రులకు వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీను, అధికారులు పాల్గొన్నారు.






