సర్వే చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలే..

by Elthuri vijay kumar |

పీఎం ఆవాస్ యోజన సర్వే చేయడంలో నిరక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి హెచ్చరించారు.

సర్వే చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలే..
X

సర్వే చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలే..

ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక కొరత లేకుండా చూడాలి

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

దిశ, పాన్ గల్ : పీఎం ఆవాస్ యోజన సర్వే చేయడంలో నిరక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి హెచ్చరించారు. గురువారం మండల కేంద్రంతో పాటు బుసిరెడ్డిపల్లి గ్రామాల్లో కలెక్టర్ ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన సర్వే చేయడంలో నిరక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇందిరమ్మ ఇళ్ల కొరకు ప్రజాపాలన కార్యక్రమం సందర్భంగా దరఖాస్తు చేసుకున్న కుటుంబాల నుండి ఎల్ (1) కేటగిరిలో ఉన్న వారి వివరాలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆన్ లైన్ లో డేటా పూర్తి చేయాలన్నారు. పంచాయతీ సెక్రెటరీలు క్షేత్రస్థాయిలో ఇంటింటికి తిరిగి వివరాలు సేకరించి ఆన్ లైన్ చేయాలన్నారు. సర్వే లో పాన్ గల్ మండలం చాలా వెనకబడి ఉందని, వేగవంతం చేయాలని ఆదేశించారు. బుసిరెడ్డిపల్లి పంచాయతీ కార్యదర్శికి సర్వే చేయడంపై సరైన అవగాహన లేకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా, సర్వే చేయడంలో అలసత్వం ప్రదర్శించిన కారణంతో ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఎంపీడీవోను ఆదేశించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన సర్వే పూర్తి చేసి జియో ట్యాగింగ్ చేయడానికి సెప్టెంబర్ 30 చివరి తేదీలోగా పూర్తి చేయాలన్నారు. ప్రతి పంచాయతీ కార్యదర్శి రోజుకు 30 ఇళ్లను సర్వే చేసి జియో ట్యాగింగ్ చేయాలన్నారు. అదేవిధంగా మండల కేంద్రంలో అలివేలమ్మ అనే ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు ఇంటి నిర్మాణం పనులను కలెక్టర్ పరిశీలించారు. ఇంటి నిర్మాణం కోసం ఇసుకకు అదనంగా డబ్బులు తీసుకుంటున్నారని లబ్ధిదారులు చెప్పగా, తహసీల్దార్ పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు ఇసుక విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వారి నుంచి అదనంగా డబ్బులు వసూలు చేస్తే చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో హౌసింగ్ డీఈ విటోభా, తహసీల్దార్ సత్యనారాయణ రెడ్డి, ఎంపీడీవో గోవింద రావు తదితరులు ఉన్నారు.

Next Story