బెట్టింగ్ అప్పుల కోసమే మహిళ దారుణ హత్య

by Ratna Kumari |

దిశ, గద్వాల క్రైమ్ : ఆన్‌లైన్ బెట్టింగ్‌ల వ్యసనానికి బానిసై అప్పులపాలైన ఓ యువకుడు, డబ్బు ఇవ్వడానికి నిరాకరించిన మహిళా వడ్డీ వ్యాపారిని హత్య చేసి ఆమె బంగారాన్ని దోచుకెళ్లిన ఘటనను గద్వాల పోలీసులు ఛేదించారు.

బెట్టింగ్ అప్పుల కోసమే మహిళ దారుణ హత్య
X

దిశ, గద్వాల క్రైమ్ : ఆన్‌లైన్ బెట్టింగ్‌ల వ్యసనానికి బానిసై అప్పులపాలైన ఓ యువకుడు, డబ్బు ఇవ్వడానికి నిరాకరించిన మహిళా వడ్డీ వ్యాపారిని హత్య చేసి ఆమె బంగారాన్ని దోచుకెళ్లిన ఘటనను గద్వాల పోలీసులు ఛేదించారు. ఈ నెల 2న‌ నమోదైన అనుమానాస్పద మృతి కేసును హత్యగా మార్చి, నిందితుడు కాళ్ల రామిరెడ్డి (27)ని అరెస్ట్ చేసినట్లు జోగులాంబ గద్వాల ఎస్పీ టి. శ్రీనివాస్ రావు మంగళవారం మీడియాకు వెల్లడించారు.

న‌వంబ‌ర్ 02వ తేదీన గద్వాల పట్టణం షేర్ అలీ వీధికి చెందిన బలిజ లక్ష్మి (55) అనే మహిళ తన ఇంట్లో మ‌ర‌ణించింది. ఆమె భర్త మల్లికార్జున్ గౌడ్ ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమాన‌స్ప‌ద మృతి కింద కేసు న‌మోదు చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా ఇది హత్య అని నిర్ధారించబడింది. దీంతో అడిషనల్ ఎస్పీ, డీఎస్పీల పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో కాళ్ల రామిరెడ్డి (27) అనే యువకుడే ఈ హత్యకు పాల్పడినట్లు తేలింది.

మహిళను హత్య చేయడానికి కారణం ఇదే

నిందితుడు కాళ్ల రామిరెడ్డి గత 3-4 సంవత్సరాలుగా ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు అలవాటు పడి సుమారు రూ. 20-25 లక్షల వరకు పోగొట్టుకున్నాడు. అప్పులు తీర్చడం కోసం వడ్డీ వ్యాపారం చేసే లక్ష్మి వద్ద రూ. 2-3 లక్షలు అప్పుగా అడిగాడు. ఆమె డబ్బు ఇచ్చేందుకు నిరాకరించడంతో, ఆ రోజు మళ్లీ వెళ్లి గొడవపడ్డాడు. కోపంతో ఆమెను తోసేయగా కింద పడిన లక్ష్మిని గొంతు బిగించి హత్య చేశాడు. అనంతరం ఆమె మెడలో ఉన్న పుస్తెల తాడును దొంగిలించాడని తెలిపారు. నిందితుడు దొంగిలించిన బంగారాన్ని శంషాబాద్ ఏరియాలోని ఒక గోల్డ్ షాప్‌లో కరిగించి సుమారు రూ. 4,60,000 తీసుకున్నాడు. పోలీసులు రామిరెడ్డిని అరెస్ట్ చేసి, అతడి నుంచి మిగిలిన రూ. 2,33,500 నగదుతో పాటు నేరానికి ఉపయోగించిన స్కూటీ, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండుకు తరలిస్తామని ఎస్పీ తెలిపారు

కేసు ఛేదించిన పోలీసులకు రివార్డులు : ఎస్పీ

క్లూస్ లేని ఈ కేసును ఛేదించడంలో కృషి చేసిన గద్వాల సర్కిల్ టీమ్‌ను ఎస్పీ టి. శ్రీనివాస్ రావు అభినందించాడు. ఈ సందర్భంగా ఈ కేసును ఛేదించడం లో ప్రతిభ చూపిన కల్యాణ్ కుమార్, ఎస్సై- గద్వాల్ టౌన్, సతీష్ రెడ్డి ఎస్సై-2, గద్వాల్ టౌన్, శ్రీకాంత్ ఎస్సై- గద్వాల్ రూరల్, సంధికర్ ఎస్సై- మల్దకల్, శ్రీహరి ఎస్సై- దరూర్, చంద్రయ్య PC-3221, కిరణ్ PC-383, రామకృష్ణ PC-2208, వీరేశ్ PC-2553 లను రివార్డులు ఇచ్చి జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినధించారు.

Next Story