- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'భూ' భాగోతం.. 150 ఏళ్ల హక్కు.. ఆధార్‌తో హతం!
జోగులాంబ గద్వాల జిల్లాలో రెవెన్యూ వ్యవస్థలో ఉన్న లొసుగులను వాడుకుని ఒక వ్యక్తి భారీ భూ దోపిడీకి తెరలేపాడు.

150 ఏళ్ల హక్కు.. ఆధార్‌తో హతం!
- తండ్రి పేరు మ్యాచ్ అవ్వడమే శాపమైంది
- రెవెన్యూ రికార్డుల గారడీ
- 37 ఎకరాల మొల్లల మాన్యం భూమి మాయం
- సామాన్యుల భూమిపై ఓఆర్సీ గొడ్డలివేటు!
- జోగులాంబ గద్వాల జిల్లాలో 'భూ' భాగోతం
- రోడ్డున పడ్డ ధర్మవరం రైతులు
దిశ, అలంపూర్: జోగులాంబ గద్వాల జిల్లాలో రెవెన్యూ వ్యవస్థలో ఉన్న లొసుగులను వాడుకుని ఒక వ్యక్తి భారీ భూ దోపిడీకి తెరలేపాడు. ఎర్రవల్లి మండలంలోని ధర్మవరం గ్రామంలోని 37 ఎకరాల మొల్లల పట్టాల భూమిపై గత 150 ఏళ్లుగా ముగ్గురు రైతుల కుటుంబాలకు ఉన్న హక్కులను కాలరాస్తూ బోరవెల్లికి చెందిన ఓ వ్యక్తి తన పేరుపై మార్చుకోవడం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. యజమానుల పేర్లతో తన తండ్రి పేరు మ్యాచ్ కావడాన్ని గమనించిన ఆ వ్యక్తి, అధికారులతో చేతులు కలిపి రికార్డులను తారుమారు చేశాడు. ఎటువంటి విచారణ లేకుండానే 'ఇనాం' రద్దు సర్టిఫికేట్(ఓఆర్సీ) ఎలా జారీ చేశారన్నది ఇప్పుడు రెవెన్యూ శాఖపై వస్తున్న ప్రధాన విమర్శ. ఈ అక్రమంపై సమాచారం ఉన్నప్పటికీ రెవెన్యూ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక పెద్ద ఎత్తున 'నగదు' లాలూచీ ఉందనే ఆరోపణలు మిన్నంటుతున్నాయి. ఇనాం భూములు ఉండటంతో తమ భూములు ఎక్కడ పోవని భావించిన ఆ రైతులకు
తీవ్రనష్టం చవిచూసింది.
ధర్మవరం గ్రామానికి చెందిన గూడుసాబ్, శాలిబి, మరో గూడుసాబ్ అనే ముగ్గురి పేర్లపై సంయుక్తంగా సర్వే నంబర్లలో 37 ఎకరాల మొల్ల మాన్యం భూమి ఉంది. గత 150 ఏళ్లుగా వీరి వారసులే ఈ భూమిని సాగు చేసుకుంటున్నారు. ప్రభుత్వానికి శిస్తు కడుతూ భూమిని ప్రాణప్రదంగా కాపాడుకుంటున్నారు. అయితే, పట్టాదారుల మరణం తర్వాత వారసులు రికార్డులను తమ పేర్లపై మార్చుకోవడంలో జరిగిన జాప్యం సదరు అక్రమార్కుడికి వరంగా మారింది.
ఆధార్ కార్డుతో అడ్డదారి..
బోరవెల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఈ భూమి యజమానుల్లో ఒకరైన 'నన్నేసాబ్' పేరు తన తండ్రి పేరుతో సరిపోవడాన్ని గమనించాడు. అంతే.. పక్కా స్కెచ్ వేశాడు. కేవలం తన ఆధార్ కార్డును చూపి ఆ నన్నేసాబ్ కుమారుడిని నేనే అంటూ రెవెన్యూ అధికారుల ముందు వాలాడు. నిబంధనల ప్రకారం ఇనాం భూములకు ఓఆర్సీ ఇచ్చే ముందు.. ఆ భూమి ఎవరి స్వాధీనంలో ఉంది? వారసత్వ ధ్రువీకరణ పత్రాలు ఏమిటి? అని విచారించాల్సిన అధికారులు, అవేమీ పట్టించుకోకుండానే రికార్డులను సదరు వ్యక్తి పేరు మీదకు మార్చేశారు.
నిమ్మకు నీరెత్తిన అధికారులు...
అసలైన వారసులు ఇప్పటికే ఇనాం రద్దు కోసం దరఖాస్తు చేసుకున్నా, వారి ఫైళ్లను అటకెక్కించిన అధికారులు, ఈ కొత్త వ్యక్తి దరఖాస్తును మాత్రం 'రాకెట్' వేగంతో ఆమోదించడం వెనుక అంతర్యమేమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. అధికారుల లాలూచీపై బాధితులు మంగళవారం ఎర్రవల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఆధార్ కార్డు చూపిస్తే రికార్డులు మార్చేస్తారా? మా 150 ఏళ్ల హక్కులను ఎలా కాలరాస్తారు?" అంటూ బాధితులు కన్నీరుమున్నీరయ్యారు.
కలెక్టరేట్ ముట్టడికి హెచ్చరిక
న్యాయం జరగకపోతే కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని బాధితులు హెచ్చరించారు. ఈ భూ దోపిడీపై ఉన్నతాధికారులు స్పందించి, అక్రమంగా జారీ చేసిన ఓఆర్సీని రద్దు చేయాలని, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ధర్మవరం గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.






