గ్రామీణ విద్యార్థుల్లో అపార ప్రతిభ దాగి ఉంది

by Ratna Kumari |

గ్రామీణప్రాంత వెనుకబడిన వర్గాల విద్యార్థుల్లో ఉన్న అపార ప్రతిభను వెలికి తీయడానికి నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

గ్రామీణ విద్యార్థుల్లో అపార ప్రతిభ దాగి ఉంది
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : గ్రామీణప్రాంత వెనుకబడిన వర్గాల విద్యార్థుల్లో ఉన్న అపార ప్రతిభను వెలికి తీయడానికి నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. 'మహబూబ్‌నగర్ ఫస్ట్' అండ్ వందేమాతరం ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో 30 రోజుల పాటు ఎన్ఎంఎంఎస్ మెరిట్ స్కాలర్ షిప్ కోసం ప్రత్యేక శిక్షణ పొంది, స్కాలర్ షిప్ సాధించిన విద్యార్థులకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులను ఘనంగా సన్మానించారు. అంతకుముందు ఎమ్మెల్యే మాట్లాడుతూ, విద్యార్థులకు సరైన వాతావరణం, ప్రోత్సాహం, తల్లిదండ్రుల సహకారం ఉంటే వారు ఐఎఎస్ , ఐపీఎస్, ఐఐటీ, డాక్టర్, ఇంజనీర్ వంటి ఉన్నత లక్ష్యాలను సాధించగలరని అన్నారు.


ప్రస్తుతం ఎంపికైన 80 మంది విద్యార్థుల్లోనే భవిష్యత్ దేశ నిర్మాతలు కనిపిస్తున్నారని, ఈ పిల్లలు సాధారణ కుటుంబాల నుంచి వచ్చినప్పటికీ, వారి ప్రతిభ అసాధారణమని పేర్కొన్నారు. వీరిని కంటికి రెప్పలా కాపాడుతూ, అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడం సమాజ బాధ్యతగా భావించాలన్నారు. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమానికి ఎన్ఆర్ఐలు సహా అనేక మంది మద్దతు ఇవ్వనున్నారని, ప్రస్తుతం ఈ విజయాలు పెద్దగా ప్రచారం కాకపోయినా త్వరలో రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్‌కు పెద్దగా భౌతిక సంపదలు లేకపోయినా, పిల్లల తెలివితేటలే అసలు సంపద అని పేర్కొంటూ, ప్రతి ఇంట్లో ఒక కోహినూర్ వజ్రం లాంటి ప్రతిభ గల పిల్లలు ఉన్నారని, ఆ ప్రతిభకు సాన పెట్టితే అద్భుతాలు సాధ్యమని తెలిపారు. విద్యార్థి జీవితంలో 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న ఐదు సంవత్సరాలు అత్యంత కీలకమని, ఈ దశలో క్రమశిక్షణ, మార్గనిర్దేశం కల్పిస్తే వారు అద్భుత ఫలితాలు సాధిస్తారని వివరించారు. అనంతరం ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డిని మెరిట్ స్కాలర్ షిప్ సాధించిన విద్యార్థులు గజమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, నగర మేయర్ మమత శ్రీనివాస్, వినోద్ కుమార్, సిరాజ్ ఖాద్రీ, వందేమాతరం ఫౌండేషన్ రవీందర్, ఎఎంఓ దుంకుడు శ్రీనివాస్, మహబూబ్‌నగర్‌ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story